- వంటకు బొగ్గు, బయోమాస్ వాడకానికి అనుమతి
న్యూఢిల్లీ: దేశంలో ఎల్‌పీజీ కొరత నెలకొన్న పరిస్థితుల్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ రాక తగ్గడంతో కిరోసిన్ సరఫరాను పెంచాయి. రాష్ట్రాలకు లక్ష లీటర్ల రెగ్యులర్ కోటాతోపాటు అదనంగా 48 వేల లీటర్లు సప్లై చేశాయి. హోటళ్లు, హాస్టళ్ల వంటి వ్యాపారాలు కిరోసిన్‌తోపాటు బయోమాస్, బొగ్గును నెలపాటు వాడటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌ను శుద్ధి చేసినప్పుడు కిరోసిన్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రాల్లో పాత కిరోసిన్ పంపిణీ నెటవర్క్ ఎలా ఉంది ? నిల్వ సామర్థ్యం ఎంత ? తదితర వివరాలను సేకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే, దేశీయ రిఫైనరీలలో ఎల్‌పీజీ ఉత్పత్తిని 25 శాతం నుంచి 28 శాతం వరకు పెంచాలని కేంద్రం ఆదేశించింది. వీలును బట్టి కమర్షియల్ సిలిండర్ల సరఫరానూ మొదలుపెడతామని గురువారం ప్రకటించింది. క్రూడాయిల్‌ను శుద్ధి చేసినప్పుడు ఎల్‌పీజీ కూడా ఉత్పత్తి అవుతుంది. కానీ, దీని వాటా 3–4 శాతం మాత్రమే ఉంటుంది. కెమికల్స్ తయారీకి వాడే గ్యాస్‌ను కూడా వంట గ్యాస్ తయారీకి మళ్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. హార్మూజ్ జలసంధి గుండా వచ్చే సరఫరాకు ఆటంకం ఉన్నందున, ఇతర మార్గాల ద్వారా ఇంధనాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఓంఎసీలకు రూ.30 వేల కోట్ల ప్యాకేజీ
ముడిచమురు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఓఎంసీలకు కలుగుతున్న నష్టాలను భర్తీ చేయడానికి రూ.30 వేల కోట్ల విలువైన ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. యుద్ధం వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ తక్కువ ధరకే గ్యాస్ అందించడం వల్ల ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలపై ఆర్థిక భారం పడటంతో ప్యాకేజీ ప్రకటించారు. దీనివల్ల చమురు సంస్థలు ఎల్‌పీజీ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన గ్యాస్ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే అందుతోంది. యుద్ధం వల్ల సరఫరా దారి మళ్లించాల్సి రావడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఈ ప్యాకేజీ ద్వారా అటు కంపెనీలకు ఊరటనిస్తూనే, ఇటు వినియోగదారులకు గ్యాస్ ధరల పెంపు నుంచి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
గ్యాస్‌లలో రకాలు
ఎల్‌పీజీ
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) నేచురల్ గ్యాస్ (మీథేన్), క్రూడ్ నుంచి విడుదలయ్యే ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్‌ల కలయికతో తయారవుతుంది. ఇళ్లకు సిలిండర్ల రూపంలో దీనిని సరఫరా చేస్తారు. ఇది వంట అవసరాలకు ప్రధాన ఆధారం. ఎల్‌పీజీ గాలి కంటే బరువుగా ఉండటం వల్ల లీక్ అయితే నేల మీద పేరుకుపోతుంది. దీనికికి మండే గుణం చాలా ఎక్కువ.
సీఎన్జీ
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్( సీఎన్జీ) అంటే అధిక ఒత్తిడికి గురైన మీథేన్ గ్యాస్. ఇది భూమి అంతర్భాగంలో సహజంగా లభించే వాయువు. సీఎన్జీని వాహనాల కోసం ఎక్కువగా వాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
పీఎన్జీ
పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ను పైపుల ద్వారా వచ్చే సహజ వాయువు అని పిలుస్తారు. సిలిండర్ల మార్పిడి, ముందస్తు బుకింగ్ వంటి ఇబ్బందులు దీనిలో ఉండవు. వాడకం చాలా సులభం, సురక్షితం. పట్టణ ప్రాంతాల్లో నిరంతర సరఫరా కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.
ముఖ్య తేడాలు
ఎల్పీజీని, సీఎన్జీని కేజీల్లో, పీఎన్జీని స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్సీఎం) లెక్కన కొలుస్తారు. నిల్వ చేసే విధానం, రవాణాలో కూడా వీటి మధ్య తేడాలు ఉంటాయి. ఎల్‌పీజీ వంటకు, సీఎన్జీ రవాణాకు, పీఎన్జీ ఇంటి అవసరాలకు అనువుగా ఉంటాయి. భద్రత పరంగా సీఎన్జీ, పీఎన్జీ మెరుగైనవి.
