కరెంట్ పొయ్యిలకు మస్త్ గిరాకీ..ఈ కామర్స్ సైట్లలో నో స్టాక్

కరెంట్ పొయ్యిలకు మస్త్ గిరాకీ..ఈ కామర్స్ సైట్లలో  నో స్టాక్
  • ఎల్​పీజీ కొరతతో ఇండక్షన్ ​స్టవ్​ల వైపు పబ్లిక్​ మొగ్గు
  • గడిచిన ఐదారు రోజుల్లో 30 శాతానికి పైగా పెరిగిన కొనుగోళ్లు 
  • ఈ కామర్స్​ సైట్లలో ‘నో స్టాక్​’

హైదరాబాద్, వెలుగు: ఎల్​పీజీ గ్యాస్ ​కొరతతో రాష్ట్రంలో కరెంట్​పొయ్యిలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా యుద్దం వల్ల పశ్చిమాసియా నుంచి పెట్రోలియం, గ్యాస్ ​సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎల్ పీజీ సిలిండర్లకు కొరత ఏర్పడింది. కమర్షియల్​ సిలిండర్లకు మాత్రమే పరిమితులు విధిస్తున్నామని, డొమెస్టిక్ ​సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కేంద్రం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 

రీఫిల్​బుకింగ్​కు ఇబ్బందులు ఎదురవుతుండడం, సిలిండర్లను ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్​ఎక్కడికక్కడ బ్లాక్​ చేస్తుండడంతో ప్రజలు అలర్ట్​అయ్యారు. ఓవైపు రీఫిల్ బుకింగ్​లు చేస్తూనే ముందుజాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్(ఎలక్ట్రికల్​ స్టవ్)లను కొనుగోలు చేస్తున్నారు.గత ఐదారు రోజులుగా వీటి కొనుగోళ్లు 30 శాతానికి పైగా పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. అటు అమెజాన్, ఫ్లిప్​ కార్ట్​వంటి ఈ  కామర్స్​సైట్లు, ఇతర ఆన్​లైన్​ప్లాట్ ఫామ్స్​లోనూ నో స్టాక్​మెసేజ్​లు దర్శనమిస్తున్నాయి. ఆఫ్​లైన్​ స్టోర్లలోనూ ఇదే పరిస్థితి ఉండడాన్ని బట్టి ప్రజలు గ్యాస్​ కొరతపై ఎంతలా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోంది.

పల్లె, పట్నం తేడా లేకుండా.. 

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ కుటుంబాలు అన్నం వండటానికి ఎలక్ట్రికల్​ రైస్​ కుక్కర్లను వాడుతున్నారు. సుమారు 60 శాతం ఇండ్లలో వీటిని వినియోగిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్లు గతంలో సిటీలు, టౌన్లకే పరిమితమైనప్పటికీ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్​ స్కీం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్​ కుక్కర్ల వాడకం పెరిగింది. టీ, టిఫిన్, కూరల కోసం మాత్రమే గ్యాస్ స్టవ్​లను ఉపయోగిస్తున్నారు. 

అయితే, ప్రస్తుతం ఎల్​పీజీ గ్యాస్​ కొరత వల్ల ముందు జాగ్రత్తగా ఇండక్షన్ ​స్టవ్​లు కొంటున్నట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితుల్లో పల్లెల్లోనూ చాలావరకు కట్టెల పొయ్యిలు తగ్గిపోయాయి. దీంతో సిలిండర్​ఖాళీ అయితే ఒక్క పూట కూడా వంట చేయలేని పరిస్థితి. అందుకే ప్రత్యామ్నాయంగా ఇండక్షన్​ స్టవ్​లను కొంటున్నారు. మోడల్​ను బట్టి రూ.1,500 నుంచి రూ.4 వేల లోపే లభిస్తుండడం, ఫ్రీ కరెంట్​ కావడంతో కొనేస్తున్నారు. 

గృహజ్యోతి వినియోగదారులే ఎక్కువ

రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లలోపు కరెంట్​ఉపయోగించే తెల్ల రేషన్​ కార్డు కలిగిన కుటుంబాలకు ఉచిత కరెంట్​సరఫరా చేస్తున్నది. ఈ కుటుంబాల నెలవారీ కరెంట్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 52.82 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుత గ్యాస్​ కొరత నేపథ్యంలో ఈ కుటుంబాల్లో ఎక్కువ మంది ఎలక్ట్రికల్​ స్టవ్​లు కొనుగోలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 

పేద, మధ్య తరగతి కుటుంబాలు నెలంతా కరెంట్ యూజ్ ​చేసినా 100 యూనిట్లలోపే కాలుతున్నది. ఎండాకాలం రావడంతో వాటర్ ​హీటర్ల వినియోగం కూడా తగ్గింది. దీంతో ఎలక్ట్రికల్​ స్టవ్​లపై వంట చేసుకుంటే తమకు గ్యాస్ ​సిలిండర్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు.