రోడ్లు, పార్కుల స్థలాలకు LRS వర్తించదు: హైకోర్టు స్పష్టీకరణ

రోడ్లు, పార్కుల స్థలాలకు LRS వర్తించదు: హైకోర్టు స్పష్టీకరణ
  • రిజిస్ట్రేషన్ ఏకపక్షంగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లేఔట్లలో రోడ్లు, పార్కులు, ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కేమ్) వర్తించదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నం.27/ఎఎ లోని 287 చదరపు గజాల స్థలానికి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ను జీహెచ్‌ఎంసీ రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కూకట్‌పల్లికి చెందిన కె. కమలమ్మ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ఇటీవల విచారణ జరిపి కీలక తీర్పు ఇచ్చారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. 2014లో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారని, రెండు తాత్కాలిక గదులు  నిర్మించి కరెంట్ బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

పొరుగువారి ఫిర్యాదుతో రోడ్డును ఆక్రమించారంటూ ఆ నిర్మాణాలను కూల్చేశారని, డ్రాఫ్ట్ లేఔట్ రద్దయినప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్‌ను రిజెక్ట్ చేశారని వాదించారు. అయితే, జీహెచ్‌ఎంసీ లాయర్ స్పందిస్తూ.. డ్రాఫ్ట్ లేఔట్ ప్రకారం ఆ స్థలం రోడ్డుకు కేటాయించబడిందని, గిఫ్ట్ డీడ్ కూడా అమల్లో ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. ఒకసారి లేఔట్‌కు పర్మిషన్ వచ్చిన తర్వాత రోడ్లు, పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన ల్యాండ్స్‌పై డెవలపర్‌కు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేశారు. గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపల్ సంస్థకు అప్పగించిన భూములు తిరిగి డెవలపర్ అధీనంలోకి రావన్నారు. అందుకే ఆ స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్‌ నిరాకరించడం సరైనదేనని పేర్కొంటూ కమలమ్మ పిటిషన్‌ను కొట్టి వేశారు.

రిజిస్ట్రేషన్ రద్దు చెల్లదు.. నిషేధిత జాబితాలోకి..
మున్సిపల్ అధికారుల లేఖ ఆధారంగా ఆ స్థల రిజిస్ట్రేషన్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 'రామలక్ష్మి వర్సెస్ తెలంగాణ' తీర్పు ప్రకారం.. ఇరుపక్షాల సమ్మతి (నోటీసులు ఇచ్చి నో అబ్జెక్షన్ తీసుకోవడం) లేదా కోర్టు ఆర్డర్ లేకుండా రిజిస్ట్రేషన్ రద్దు చేయడం చెల్లదని స్పష్టం చేసింది. అయితే చట్ట ప్రకారం అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని సూచించింది.