- రాణించిన జడేజా, ఆర్చర్
- మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ వృథా
లక్నో: ఐపీఎల్–19లో రెండు వరుస పరాజయాల తర్వాత రాజస్తాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమయోచితంగా రాణించి ఓ లో స్కోరింగ్ మ్యాచ్‌ను అద్భుతంగా కాపాడుకుంది. రవీంద్ర జడేజా (29 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 నాటౌట్) మెరుపులకు తోడు బౌలర్లందరూ చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ 40 రన్స్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై నెగ్గింది. లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది. తర్వాత జోఫ్రా ఆర్చర్ (3/20) దెబ్బకు లక్నో 18 ఓవర్లలో 119 రన్స్‌కే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (41 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 55) టాప్ స్కోరర్. జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
తలా ఓ చేయి..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ లైనప్‌ను లక్నో బౌలర్లు మహ్మద్ షమీ (2/30), మోషిన్ ఖాన్ (2/17), ప్రిన్స్ యాదవ్ (2/29) కట్టడి చేశారు. ఆరంభంలో యశస్వి జైస్వాల్ (22) ధనాధన్ షాట్లతో రెచ్చిపోయినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. మూడో ఓవర్‌లో షమీ వరుస బాల్స్‌లో జైస్వాల్, ధ్రువ్ జురెల్ (0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. నాలుగో ఓవర్‌లో మోషిన్ దెబ్బకు వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (8) పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా రాయల్స్ 32/3తో కష్టాల్లో పడింది. 44/3తో పవర్‌ప్లేను ముగించిన రాయల్స్‌ను రియాన్ పరాగ్ (20), హెట్‌మయర్ (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. స్ట్రయిక్ రొటేట్ చేసినా భారీ షాట్లు ఆడలేకపోయారు. 9వ ఓవర్‌లో ప్రిన్స్ యాదవ్.. పరాగ్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 30 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఈ దశలో వచ్చిన జడేజా నిలకడగా ఆడాడు. హెట్‌మయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా భారీ స్కోరు అందించలేకపోయాడు. ఐదో వికెట్‌కు 15 రన్స్ జత చేసి హెట్‌మయర్ వెనుదిరిగాడు. చివర్లో పెరీరా (20), శివమ్ దూబే (19 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించడంతో రాయల్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
ముగ్గురు డకౌట్లు
చిన్న ఛేజింగ్‌లో లక్నోకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. రాజస్తాన్ దీటైన బౌలింగ్ ముందు లక్నో స్టార్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కు ఆయుష్ బదోనీ (0), రెండో ఓవర్‌లో రిషబ్ పంత్ (0), మూడో ఓవర్‌లో మార్‌క్రమ్ (0) డకౌట్లయ్యారు. దాంతో 11/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినా ఓ ఎండ్‌లో మిచెల్ మార్ష్ ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోవడంతో లక్నో పవర్‌ప్లేలో 31/3 స్కోరు చేసింది. రెండో ఎండ్‌లో నికోలస్ పూరన్ (22) కూడా బ్యాట్ అడ్డేయడంతో వికెట్ల పతనం ఆగింది. దాదాపు ఆరు ఓవర్ల పాటు ఈ ఇద్దరు స్వేచ్ఛగా ఆడారు. కానీ పదో ఓవర్‌లో జడేజా (1/29) దెబ్బకు పూరన్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. హిమ్మత్ సింగ్ (15)తో కలిసి మార్ష్ భారీ షాట్లకు తెరలేపాడు. వరుసపెట్టి బౌండ్రీలు రాబట్టారు. ఐదో వికెట్‌కు 37 రన్స్ జతయ్యాయి. ఈ క్రమంలో మార్ష్ 39 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 16వ ఓవర్‌లో బర్గర్ (2/27).. మార్ష్‌ను ఔట్ చేయడంతో లక్నో పరుగుల వేటలో వెనకబడింది. వరుస విరామాల్లో ముకుల్ చౌదరీ (7), మహ్మద్ షమీ (6), మయాంక్ యాదవ్ (5), మోషిన్ ఖాన్ (0) వెనుదిరగడంతో లక్నో పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 159/6 (జడేజా 43*, మోషిన్ ఖాన్ 2/17). లక్నో: 18 ఓవర్లలో 119 ఆలౌట్ (మార్ష్ 55, పూరన్ 22, ఆర్చర్ 3/20).

