భారత ఆర్మీకి కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ధీరజ్ సేథ్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీఓఏఎస్) గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆయన ఈ నెల 30న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానాన్ని ధీరజ్ సేథ్ భర్తీ చేస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌కు.. కార్యాచరణ, వ్యూహాత్మక, సామర్థ్య అభివృద్ధి, సంస్థాగత రంగాలలో విస్తృతమైన అనుభవం ఉంది.
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ధీరజ్ సేథ్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీఓఏఎస్) గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఈ నెల 30న బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ‘జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా జనరల్ హోదాలో ఈ నెల 30న బాధ్యతలు చేపడతారు. ఆయన 2028 ఆగస్టు 31 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈమేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ధీరజ్ సేథ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీఓఏఎస్)గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానాన్ని ధీరజ్ సేథ్ భర్తీ చేస్తారు.
ధీరజ్ సేథ్ ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. డిసెంబర్ 1986లో ఆర్మర్డ్ కోర్లో ఆయన నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌కు.. కార్యాచరణ, వ్యూహాత్మక, సామర్థ్య అభివృద్ధి, సంస్థాగత రంగాలలో విస్తృతమైన అనుభవం ఉంది. ఎడారి సెక్టార్‌లోని ఆర్మర్డ్ రెజిమెంట్, వెస్ట్రన్ థియేటర్‌లోని ఆర్మర్డ్ బ్రిగేడ్, జమ్మూ కాశ్మీర్‌లోని కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్‌కు ఆయన కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీలోని ప్రధాన స్ట్రైక్ ఫార్మేషన్‌లలో ఒకటైన సుదర్శన్ చక్ర కోర్కు కమాండ్‌గా వ్యవహరించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా పనిచేశారు.
