జైపూర్ : రాజస్థాన్లోని పశువుల్లో పెరుగుతోన్న లంపీ స్కిన్ వ్యాధి తీవ్రతను ఆ రాష్ట్ర సర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశానికి తనతో పాటు ఓ ఆవును తీసుకుని వచ్చారు. పుష్కర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ సింగ్ రావత్ ఆవును అసెంబ్లీ క్యాంపస్-లోకి తీసుకొచ్చారు. ప్రాంగణమంతా దాన్ని తిప్పారు.
లంపీ స్కిన్ అనే చర్మవ్యాధితో ఆవులు బాధపడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాఢ నిద్రలో ఉందని సింగ్ విమర్శించారు. వ్యాధి తీవ్రతను సర్కారు దృష్టికి తెచ్చేందుకే ఇలా చేశానని వెల్లడించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగా.. అక్కడ జరుగుతున్న సందడితో ఆవు పారిపోయింది. దాంతో "చూడండి, గోమాత కూడా ప్రభుత్వంపై కోపంగా ఉంది." అని ఎమ్మెల్యే కామెంట్ చేశారు. వ్యాధి నుంచి ఆవులను కాపాడటానికి మెడిసిన్స్, వ్యాక్సిన్లు ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు.
