ఇవాళ(అక్టోబర్ 28) చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు అస్సలు చూడకూడదు

ఇవాళ(అక్టోబర్ 28) చంద్రగ్రహణం..  ఈ రాశుల వారు అస్సలు చూడకూడదు

కుమార పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం(అక్టోబర్ 28) రాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో ప్రత్యేక సేవలు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు. గ్రహణాన్ని కొన్ని రాశులవారు చూడకూడదని.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలుంటాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. 

ఈ రాశుల వారు చూడకూడదు..

మేష, కర్కాటక, సింహరాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు ఈ గ్రహణం చూడరాదని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపారు. కుమార పౌర్ణమి పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వారంతా శనివారం(అక్టోబర్ 28) మధ్యాహ్నం 3.30 గంటల లోపుగా చేయాలని సూచించారు. ప్రసాదాలు అంటే భోజనం 4 గంటలు లోపుగా తీసుకోవాలని.. తర్వాత ఆహారం చేయరాదని చెప్పారు. మూడు రాశులు, అశ్విని నక్షత్రం వారికి మినహాయిస్తే మిగతా తొమ్మిది రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని ఆచార్యులు చెబుతున్నారు.

Also Read :- పొద్దంతా ఎండ .. రాత్రంతా చలి

రాత్రంతా ఆలయం తెరుస్తారు..

గ్రహణ కాలం ముందుగా భారత దేశంలోని అన్ని పవిత్ర క్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవని పండితులు చెబుతున్నారు. ఆలయాల తలుపులు మూసేస్తామని.. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుందని తెలిపారు. స్వామికి గోప్య సేవలు జరుగుతాయని చెప్పారు. అయితే ఆలయంలో భక్తులు పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారని వివరించారు. గ్రహణం విడిచిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ నిర్వహిస్తారని తెలిపారు. ఆ తర్వాత మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయని పండితులు చెప్పారు.

యాదగిరిగుట్ట టెంపుల్ బంద్..

పాక్షిక చంద్రగ్రహణం వల్ల శనివారం(అక్టోబర్ 28) సాయంత్రం 4 గంటల నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మూసివేయనున్నట్లు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు నారసింహుడి ప్రధానాలయంతో పాటు పాతగుట్ట టెంపుల్, అనుబంధ ఆలయాలు, ఉపాలయాలను మూసివేయనున్నట్లు చెప్పా రు. ఆదివారం(అక్టోబర్ 29) తెల్లవారుజామున మళ్లీ గుడి తలుపులు తెరిచి ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేస్తామని తెలిపారు. 

శ్రీశైలం టెంపుల్ మూసివేత..

చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని శనివారం(అక్టోబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి(అక్టోబర్ 29) రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. 29వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజలు చేస్తామని, 7 గంటల నుంచి భక్తులను దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలకు అనుమతిస్తామని వివరించారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే సర్వదర్శనం చేసుకోవచ్చని అర్చుకులు తెలిపారు.