- బాధితులకు అందజేసిన సీపీ రమేశ్
గచ్చిబౌలి, వెలుగు: సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.3.04 కోట్ల విలువైన 1016 ఫోన్లలో కొన్నింటిని కమిషనరేట్ ప్రాంగణంలో, మిగిలిన వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో మంగళవారం బాధితులకు అందజేశారు.
దొంగలించిన సెల్ఫోన్ల ఐఎంఈఐ నంబర్‌ను సీఈఐఆర్ పోర్టర్లో నమోదు చేసుకుంటే, సదరు ఫోన్ వేరే వ్యక్తులు వాడిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అలర్ట్ వస్తుందని, తద్వారా రికవరీ సులభమవుతుందని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ‘క్రాక్ డౌన్’ ద్వారా వంద మందికి పైగా సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని, తాజాగా 103 మంది బాధితుల అకౌంట్లను డీఫ్రీజ్ చేసి రూ.63 లక్షల సొమ్మును రక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి, సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ సహా పలువురు పోలీస్ అధికారులు, బాధితులు పాల్గొన్నారు.
