
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతూ మే 12న సంచలన ప్రకటన చేశాడు. అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న 36 ఏళ్ళ కోహ్లీకి మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. కోహ్లీ ఇంత త్వరగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో భారత దిగ్గజ ఆల్ రౌండర్ మదన్ లాల్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు.
మదన్ లాల్ మాట్లాడుతూ.. "భారత క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న మక్కువ సాటిలేనిది. రిటైర్మెంట్ తర్వాత అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావాలని నా కోరిక. రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడంలో తప్పు లేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా, తదుపరి సిరీస్‌లో కోహ్లీ తిరిగి రావాలి. కోహ్లీ తన ఆలోచన మార్చుకోవాలి. అతని పరుగులు సాధించాలనే కసి.. ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరుగా ఉన్నప్పుడు ఆటకు దూరంగా ఉండకూడదు. అతను ఇంకా టెస్ట్ క్రికెట్‌లో చాలా సాధించాల్సి ఉంది". అని ఈ భారత లెజెండరీ అల్ రౌండర్ అన్నాడు.
మదన్ లాల్ టీమిండియా 1983 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్. దశాబ్దాల కెరీర్‌లో తనదైన మార్క్ చూపించాడు. 39 టెస్ట్ మ్యాచ్‌లు.. 67 వన్డే ఇంటర్నేషనల్స్‌లో టీమిండియా తరపున ఆడాడు. 1,400 అంతర్జాతీయ పరుగులతో పాటు 144 వికెట్లు తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అతనొక దిగ్గజం. 10,000 కంటే ఎక్కువ ఫస్ట్-క్లాస్ పరుగులు సాధించడంతో పాటు 625 వికెట్లు తీసుకున్నాడు.
టెస్ట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. గత రెండేళ్లుగా ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్వదేశంలో స్పిన్ ధాటికి కుదేలయ్యాడు. చివరి రెండేళ్లలో కోహ్లీ యావరేజ్ 30 కంటే తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. పేలవ ఫామ్ తో తన టెస్ట్ యావరేజ్ 54 నుంచి 47 కి పడిపోయింది. ఫామ్ లేని కారణంగా కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. 46.85 యావరేజ్ తో 9230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Legendary Indian all-rounder Madan Lal has urged Virat Kohli to reconsider his retirement from Test cricket. pic.twitter.com/H9jB2tCnSt
— CricTracker (@Cricketracker) July 17, 2025