మాదాపూర్, వెలుగు: శిక్షణ ఇచ్చి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 452 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కామెల్‌క్యూ కంపెనీ సీఈఓతో పాటు ఇద్దరిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. జనగామకు చెందిన ఎరుకల మహేశ్(32) 2019 నుంచి 2024 వరకు పలు ఐటీ కంపెనీల్లో పని చేశాడు. ఈ సమయంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే విధానాన్ని గమనించాడు.
తాను కూడా అదే విధంగా కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. 2024 ఆగస్టులో కేపీహెచ్‌బీలోని మంజీరా ట్రినిటీ భవనం నాలుగో అంతస్తులో కామెల్‌క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించాడు. అదే సంవత్సరం మాదాపూర్‌లో మరో రెండు శాఖలు ప్రారంభించి సిబ్బందిని నియమించుకున్నాడు. కంపెనీ ద్వారా శిక్షణ ఇచ్చి ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.80 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు. వసూలైన డబ్బులో రూ.80 వేలను కంపెనీ బ్యాంకు ఖాతాలో జమ చేయించి మిగిలిన మొత్తంలో కొంత ఉద్యోగులకు కమీషన్లుగా ఇచ్చాడు.
ఈ విధంగా 452 మంది నుంచి సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. మొదట్లో కొందరికి జీతాలు చెల్లించి తర్వాత ఆపేశాడు. అనంతరం ఎంయూ సాఫ్టెక్ సొల్యూషన్ పేరుతో మరో కంపెనీ ప్రారంభించి కామెల్‌క్యూ కంపెనీని మూసివేశాడు. దీంతో మోసపోయిన బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు మహేశ్తో పాటు హెచ్‌ఆర్ రిక్రూటర్ ఉదయలక్ష్మి, అపరేషన్స్ హెడ్ నజీర్ బాషాను అరెస్ట్ చేశారు. వారి వద్ద కారు, స్కూటీ, సెల్‌ఫోన్‌లు, పలు బ్యాంకుల పాస్బుక్లు, చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఏడుగురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
