రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకం

రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకం
  • రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అనడం తప్పు : మధుయాష్కీ గౌడ్ 
  • కామెంట్లపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్​కు బహిరంగ లేఖ 

హైదరాబాద్ : ‘‘రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ’’ అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు.. కాంగ్రెస్​ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇది ​సోనియా, రాహుల్​ను అవమానించినట్లేనని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఏం మాట్లాడినా పబ్లిక్ అవుతుందని, అందులో వ్యక్తిగతమని చెప్పడానికి ఏమీ ఉండదన్నారు. రేవంత్ మాటలు అందరినీ కించపరిచేలా ఉన్నాయని.. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రేవంత్​కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ అంటే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు, వర్గాలు, మతాల కలయిక అని అందులో పేర్కొన్నారు. ‘‘వరంగల్​ డిక్లరేషన్ లాంటి నిర్ణయాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ వైపు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గాల్లో అలజడి మొదలైంది. పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది” అని చెప్పారు. రెడ్ల సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని అంటే 2018లో ఉత్తమ్​కుమార్ రెడ్డి హయాంలో పార్టీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఆ టైమ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఉన్న రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. రేవంత్ కాంగ్రెస్​లోకి కొత్తగా వచ్చారని, అందుకే ఆయనకు పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు తెలియవని మధుయాష్కీ అన్నారు. ‘‘నెహ్రూ నుంచి సోనియా వరకు అందరూ పార్టీలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యంతో పదవులు ఇచ్చారు. పార్టీలో అన్ని పదవులు పొందిన రెడ్లే ‘‘రెడ్డి కాంగ్రెస్’’ ఏర్పాటు చేసి, వెన్నుపోటు పొడవాలని చూశారని గుర్తు చేశారు. 

వక్రీకరించొద్దు : రేవంత్​
మధుయాష్కీ లేఖపై రేవంత్ ట్విట్టర్​లో స్పందించారు. ‘‘కాంగ్రెస్ ​ఎప్పుడూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా నిలబడింది. సమాజంలోని అన్ని వర్గాలను పరిరక్షించేలా పోరాటం చేసిందని నమ్ముతున్నాను. పీసీసీ అధ్యక్షుడిగా నేనూ ఇదే తత్వాన్ని నమ్ముతాను. అన్ని వర్గాలతో కలిసి పని చేయడాన్నే విశ్వసిస్తాను. నా వ్యాఖ్యల్ని వక్రీకరించే వాళ్లు ఆ పని మాని, రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుంది” అని ట్వీట్​లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం : -

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు


హైదరాబాద్లో ప్రధానికి ఘన స్వాగతం