జూబ్లీహిల్స్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి కుమార్తె ల కారుకు యాక్సిడెంట్

జూబ్లీహిల్స్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి కుమార్తె ల కారుకు యాక్సిడెంట్
  • డీసీఎంను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయిన కారు
  •     ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్ప గాయాలు 

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్​పై ప్రమాదానికి గురైంది. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర నాగ, దిశర తమ స్నేహితులు అరికపూడి దుర్గాసాయి, మేడిపల్లి అభిరామిరెడ్డితో కలిసి ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తమ ఫ్రెండ్స్​కు వీడ్కోలు పలికారు.

అనంతరం గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తమ ఫార్చునర్ కారులో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ చౌరస్తా దాటిన తర్వాత వీరి ముందు వెళ్తున్న డీసీఎం టైరు ఒక్కసారిగా ఊడిపోవడంతో ఆ వాహనం వేగం తగ్గి ఒక పక్కకు ఒరిగింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఫార్చునర్ కారు అదుపుతప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది.

దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులో ఉన్న వారికి ప్రాణపాయం తప్పింది. ఈ ఘటనలో అక్షర నాగకు తీవ్ర గాయాలు కాగా, దిశరతోపాటు ఇతర స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. డీసీఎం డ్రైవర్​పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.