- వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర
- రాష్ట్రమంతటా కిటకిటలాడిన శైవక్షేత్రాలు
మెదక్/పాపన్నపేట/వేములవాడ/మహాదేవ్‌పూర్, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి అభిషేకాలు నిర్వహించి శివ నామస్మరణ చేస్తూ భక్తులు పరవశించిపోయారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో మహాశివరాత్రి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది.
వన దుర్గా భవానీమాతకు తెల్లవారుజామునే పూజారులు అభిషేకం నిర్వహించి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ప్రభుత్వం తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివాని దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా నది పాయ మధ్యలో కొలువుదీరిన మహా శివుడికి పూజలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
వేములవాడ రాజన్న సన్నిధి శివనామస్మరణతో మార్మోగింది. రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. 2 లక్షల మంది భక్తులు రాగా, ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి ద్విలింగ రూపంలో వెలిసిన ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సరస్వతి ఘాట్ వద్ద తెప్పోత్సవం నిర్వహించారు. హంసవాహనంపై స్వామి వారి జలవిహారం కమనీయంగా సాగింది.
