పాలమూరు ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం.. మహబూబ్ నగర్ జిల్లాలో బీడు భూములు, నీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం

పాలమూరు ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం.. మహబూబ్ నగర్ జిల్లాలో బీడు భూములు, నీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం
  •     ఎంపీ మల్లు రవి, విప్ యెన్నం 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌‌నగర్ ప్రాజెక్టుల సాధనకు తన వంతు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ ఎంపీ  మల్లు రవి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ సిటీలోని క్రౌన్ ఫంక్షన్ హాల్‌‌లో ఉమ్మడి జిల్లాలో బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతుల  ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. పెండింగ్‌‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయొచ్చన్నారు.

 రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాలు కలిసి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. 

 గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేశామని చెప్పడం అవాస్తమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో  రైతులను కూడా భాగం చేయాలని,  సమస్యలపై స్పష్టమైన అవగాహన కల్పించి, సరైన పరిష్కార మార్గాలను చూపాలన్నారు.

 అంతర్రాష్ట్ర సమన్వయం ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు. కృష్ణా నది నీటి వినియోగంపై తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాలు కలిసి చర్చిస్తేనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, లీడర్లు సాయిబాబా, షేక్ ఫరూఖ్ హుస్సేన్, జనార్ధన్, వీరబ్రహ్మాచారి, జగపతిరావు, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, రమేశ్‌‌రెడ్డి, ప్రశాంత్  పాల్గొన్నారు.