మూసీకి కావాల్సింది పునరుజ్జీవం: వెదిరె శ్రీరామ్

మూసీకి కావాల్సింది పునరుజ్జీవం: వెదిరె శ్రీరామ్
  • చేపలు బతికేలా నీటి నాణ్యత పెంచాలి: వెదిరె శ్రీరామ్​
  • సీడబ్ల్యూసీ ప్రకారం  బఫర్ జోన్​ నిర్ణయించాలె.. డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో క్లారిటీ లేదు
  • మధు పార్క్ రిడ్జ్ వాసులు వార్నింగ్ జోన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.. కూల్చనక్కర్లేదు
  • కాంక్రీటు కట్టడాలతో నది బాగుపడదు.. మూసీపై పీపీటీ
  • మూసీ ముసుగులో కాళేశ్వరం తరహా దోపిడీ: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు
  • పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోం.. ముందు పునరావాసం ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మూసీ నది ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో శాస్త్రీయత లోపించిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు, కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. నది పునరుజ్జీవనానికి, నదీ తీర అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘మూసీ నది పునరుజ్జీవనం – వాస్తవాలు’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్​రావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా టెక్నికల్ అంశాలను వివరించారు. కేవలం కాంక్రీటు కట్టడాలు, సుందరీకరణతో నది బాగుపడదని, అందులో జీవ వ్యవస్థ పునరుద్ధరణ జరిగినప్పుడే అసలైన ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సిఫారసుల ప్రకారమే బఫర్ జోన్లను నిర్ణయించాలన్నారు. డీపీఆర్ లో క్లారిటీ లేదనీ, ఏ గైడ్​లైన్స్ ప్రకారం తీసుకున్నారనేది స్పష్టత లేదన్నారు. నది అంటే కేవలం ప్రవహించే నీరు మాత్రమే కాదని.. భూగర్భ జలాలు, పాలియో చానల్స్, రైపేరియన్ జోన్ వంటి అనేక అంశాల కలయిక అన్నారు. నదిలో చేపలు జీవించగలిగేలా నీటి నాణ్యతను పెంచడమే అసలైన పునరుజ్జీవనమని ఆయన తెలిపారు. నది సహజ వడపోత వ్యవస్థను దెబ్బతీసేలా కాంక్రీటు గోడలు నిర్మించడం పర్యావరణానికి హానికరమని హెచ్చరించారు.

గంగమ్మ శుద్ధికే రూ.20 వేల కోట్లు.. 
మూసీకి లక్షల కోట్లా?: రాంచందర్ రావు

మూసీ నది ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో ఎలాగైతే దోచుకుందో, ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పేరుతో అదే పునరావృతం కాబోతోందన్నారు. వేల కిలోమీటర్ల పొడవున్న గంగానదిని శుద్ధి చేసే నమామి గంగే ప్రాజెక్టుకే ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారనీ, కానీ, కేవలం కొన్ని వందల కిలోమీటర్లు ఉండే మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడానికి, రైతు భరోసా అమలు చేయడానికి పైసల్లేవని చెబుతున్న సర్కార్.. ఈ భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తుందని నిలదీశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా డిస్‌‌‌‌ప్లేస్‌‌‌‌మెంట్ జరిగితే ముందుగా పునరావాసం కల్పించాలనీ, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ముందు కూల్చి, తర్వాత ఇస్తామంటోందని ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. నార్సింగి లాంటి చోట్ల పెద్ద పెద్ద నిర్మాణాలకు లేని బఫర్ జోన్ రూల్స్.. ఎక్స్ సర్వీస్ మెన్లు, మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఇళ్లకు మాత్రం ఎందుకు వర్తిస్తాయని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 3వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటే రైతుల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ శుద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో జరిగే అవినీతిని, పేదల ఇళ్ల కూల్చివేతలను సహించబోమని స్పష్టం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకున్నారని రాంచందర్ రావు కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి మోదీ మొత్తం 8,931 రోజుల పాటు పదవిలో కొనసాగి, సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారని, ఇది దేశానికే గర్వకారణమని చెప్పారు.

మూడు విభాగాల మూసీ ప్రక్షాళన

మూసీ ప్రక్షాళనను మూడు భాగాలుగా చేపడితేనే ఆశించిన ఫలితాలు వస్తాయని వెదిరె శ్రీరామ్ సూచించారు. ఎగువ ప్రాంతం అనంతగిరి - 90 కి.మీ ఏరియాలో క్యాచ్‌‌‌‌మెంట్ ఏరియా చికిత్స చేపట్టాలని, రిడ్జ్ టు వ్యాలీ పద్ధతిలో చెక్ డ్యామ్‌‌‌‌లు, కందకాలు నిర్మించి భూగర్భ జలాలు పెంచాలని సూచించారు. నగర పరిధి హైదరాబాద్‌‌‌‌లో 55 కి.మీ పరిధిలో మురుగునీరు నదిలోకి చేరకుండా ఇంటర్సెప్టర్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలనీ, కేవలం శుద్ధి చేసిన నీటినే నదిలోకి వదలాలని సూచించారు. బఫర్ జోన్ విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. దిగువ ప్రాంతం నల్గొండ, సూర్యాపేట 120 కి.మీ పరిధిలో నగర మురుగుతో కింద పండే పంటలు, పాలు విషతుల్యమవుతున్నాయనీ, అక్కడ వెట్‌‌‌‌ల్యాండ్స్ అభివృద్ధి చేసి సహజ శుద్ధి విధానాలు అమలు చేయాలని కోరారు.మొత్తం మూసీ బేసిన్‌‌‌‌ను పర్యవేక్షించేందుకు మూసీ రివర్ బేసిన్ అథారిటీని ఏర్పాటు చేయాలని శ్రీరామ్ సూచించారు. నీటి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. నమామి గంగే, సబర్మతి ప్రాజెక్టుల తరహాలో కాలనీ, వార్డు స్థాయిలో ప్రజలు, నిపుణులతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే తుది ప్రణాళికను అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేని ఏ ప్రాజెక్టు విజయవంతం కాదని ఆయన పేర్కొన్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌‌‌‌మెంట్ వార్నింగ్ జోన్‌‌‌‌లో ఉందనీ, ప్రొటెక్టెడ్ జోన్‌‌‌‌లో కొంత భాగమే ఉన్నట్టు చెప్పారు. కనుక దాన్ని కూల్చాల్సిన అవసరం లేదన్నారు.