కాళేశ్వరం ముంపుపై మీటింగ్​ పెట్టండి..తెలంగాణకు మహారాష్ట్ర లేఖ

కాళేశ్వరం ముంపుపై మీటింగ్​ పెట్టండి..తెలంగాణకు మహారాష్ట్ర లేఖ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో తలెత్తే ముంపుపై ఇంటర్ ​స్టేట్​ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర డిమాండ్​చేసింది. ఈమేరకు ఆ రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు తెలంగాణ ఇరిగేషన్ ​డిపార్ట్​మెంట్​కు గురువారం లేఖ రాశారు. 2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్​స్టేట్​బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మేడిగడ్డ బ్యాక్​వాటర్ ​ఎఫెక్ట్​తో పాటు ఫ్లడ్, డిజైన్​ను ​స్టడీ చేయాలని కోరారు. తాము ఈ విషయమై ఏడేండ్లుగా కోరుతున్నా.. కనీసం స్టడీ కూడా చేయలేదన్నారు. 

2022 జులైలో గోదావరికి పోటెత్తిన వరదలతో సిరొంచతో పాటు పలు ప్రాంతాల్లో మేడిగడ్డ బ్యారేజీ కారణంగా పెద్ద ఎత్తున ముంపు వాటిల్లిందని తెలిపారు. మళ్లీ వర్షాకాలం సీజన్​వచ్చినా వరద ముంపు నివారణ చర్యలేవి చేపట్టలేదన్నారు. మేడిగడ్డ ముంపు ప్రాంతాలుగా గుర్తించిన భూములకు పరిహారంగా రూ.25.64 కోట్లను గడ్చిరోలి కలెక్టర్​ వద్ద డిపాజిట్​ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు డబ్బులు జమ చేయలేదన్నారు. మేడిగడ్డ బ్యాక్​వాటర్​తో తలెత్తే ముంపుపై వెంటనే రెండు రాష్ట్రాల ఇరిగేషన్​ప్రిన్సిపల్​సెక్రటరీలు,స్పెషల్​సీఎస్​ల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 2022 జులైలో తలెత్తిన వరదలను ప్రామాణికంగా తీసుకొని ముంపు ప్రభావం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.