- నేడు మహాశివరాత్రి పర్వదినం
- శివపార్వతుల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం రూరల్, కారేపల్లి, పాల్వంచ, మధిర, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. సంగమేశ్వరస్వామి ఆలయం మూడు నదుల కలయికతో ఏర్పడి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
తీర్థాల త్రివేణి సంగమం సంగమేశ్వరుడి ఆలయంలో ఐదు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులు భారీగా హాజరుకానుడడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరం నుంచి రెండు మార్గాల ద్వారా వెళ్లే రహదారుల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
నేటి నుంచి కోటిలింగాల జాతర షురూ..
మహాశివరాత్రి సందర్భంగా కారేపల్లి మండలం పోలంపల్లి ప్రాంతంలో కోటిలింగాల జాతర ప్రారంభంకానుంది. మూడు రోజులపాటు జరిగే జాతర కోసం ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు..
నేటి నుంచి ఈనెల 18 వరకు వరకు మధిరలో మృత్యుంజయస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం మధిర శివాలయం వద్ద ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
ఘనంగా ఉత్సవాలు ప్రారంభం..
పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శనివారం శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం గా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
