శ్రీశైల మల్లన్నకు వైభవంగా ప్రభోత్సవం

శ్రీశైల మల్లన్నకు వైభవంగా ప్రభోత్సవం

కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారి ప్రభోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం సాయంత్రం కన్నుల పండుగలా జరిగిన ప్రభోత్సవంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. పలు రకాల పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తుండగా భక్తులు కనులారా చూసి ఆనందపారవశ్యం పొందారు. ప్రభోత్సవంలో భాగంగా కళాకారుల నాదస్వరం, కోలాటం, చెక్క భజన, శంఖం, ఢమరుకం, బీరప్పడోలు, పగటి వేషాలు, తప్పెట బిందు, డోలు విన్యాసాలు మొదలైన సంప్రదాయ జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మొదలైన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య ప్రభోత్సవం నేత్ర పర్వంలా సాగింది.