దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో ఆయనొక ట్రెండ్ సెట్టర్. సంచలన సినిమాలు చేయాలన్నా..సాహస సినిమాలు తీయాలన్నా..సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా. నటుడిగా మొదలైన సినీ జీవితంలో... దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలు తీశారు. నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలను నిర్మించారు. స్టూడియా నిర్మించి..ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజెండ్. సూపర్ కృష్ణ 83వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
కృష్ణ 350కి పైగా చిత్రాల్లో నటించి చిరస్మరణీయ వారసత్వాన్ని అందించారు. ఈ నేపథ్యంలో కృష్ణ నట వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానుల హృదయాలను టచ్ చేసింది. “ఎప్పటికీ నువ్వే నా హీరో.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ రోజు, ప్రతిరోజూ మీ గురించే ఆలోచిస్తున్నాను” అంటూ మహేష్ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఇది కేవలం ఓ పోస్టు మాత్రమే కాదు.. తండ్రి కృష్ణపై తనకున్న అపారమైన ప్రేమ, గౌరవం, అనుబంధానికి అద్దం పట్టే భావోద్వేగ నివాళిగా నిలిచింది.
Forever my hero….Happy Birthday Nanna ♥️♥️♥️ pic.twitter.com/7ATfMvAEMx
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2026
తండ్రికి తగ్గ తనయుడిగా మహేశ్ బాబు సినిమాల్లోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మహేశ్ సినీ ప్రయాణానికి బలమైన పునాది వేసింది కృష్ణే. బాలనటుడిగా వెండితెరకు పరిచయం చేయడంతో పాటు, కెరీర్‌లో ప్రతి కీలక దశలో మార్గదర్శకుడిగా నిలిచారు. వీరిద్దరూ కలిసి దాదాపు 11 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ నేపథ్యంలోనే తండ్రి నుంచి నేర్చుకున్న సినీ పాఠాలు ఇప్పుడు ఫ్యాన్స్ అరుపులకు, ఎదురుచూపులకు సింహా స్వప్నంలా మారాయి.
మహేష్ బాబు సతీమణి నమ్రత ఇంస్టాగ్రామ్ వేదికగా నివాళి అర్పించింది. “ఎల్లప్పుడూ ప్రేమతో మిమ్మల్ని స్మరించుకుంటూ... పుట్టినరోజు శుభాకాంక్షలు, మామయ్య” అని నమ్రత పోస్ట్ చేసింది.
అలా మొదలైంది..
సూపర్ స్టార్ కృష్ణ 1943,మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1960లో ఏలూరు CR రెడ్డి. కాలేజీలో బిఎస్సీ చదివారు. ఆయన తొలిసారిగా పాతాళభైరవి సినిమా చూశారు. దేవదాసు వంద రోజుల పండగకు ఏఎన్నార్,సావిత్రిలు తెనాలి వచ్చారు. అయితే వారిని చూసేందుకు వేల సంఖ్యలో జనం రావడంతో..ఆశ్చర్యపోయారు. అలాంటి గౌరవాన్ని తానూ సంపాదించాలనే కోరికతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. మొదట నాటకాలు, వేషాలు వేశారు. 1960లో చేసిన పాపం కాశీకెళ్ళినా అనే నాటకంలో కృష్ణ నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం. ఆ తర్వాత భక్త శబరి,సీతారామ కళ్యాణం, ఛైర్మన్ వంటి నాటకాల్లో నటించి మెప్పించారు.
52 ఏళ్ల సినీ ప్రస్థానం..
నాటకాల్లో రాణించడంతో..మద్రాసు చేరి సినిమా చాన్సుల కోసం ప్రయత్నించారు కృష్ణ. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ 1964లో ‘తేనె మనసులు’ చిత్రంలో హీరోగా నటించే చాన్స్ వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో బసవరాజు అనే పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు కృష్ణ. ఆ తర్వాత మరో సినిమా చేసినా.. హీరోగా నటించిన మూడో చిత్రం ‘గూఢచారి 116’ ఆయనకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.
ఇక డెబ్భై, ఎనభైల కాలంలో ఆయనదే హవా. యేటా పది సినిమాలు చేసేవారు. ఒక సంవత్సరమైతే పద్దెనిమిది సినిమాల్లో నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్‌లో మూడొందల నలభైకి పైగా సినిమాలు చేశారంటే ఆయనకి ఏ స్థాయిలో డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1968 నుంచి 74 వరకు ఏడాది ఆయన పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కోసారి పట్టణాల్లోని అన్ని థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవి. ఆ రోజుల్లో కృష్ణ..రోజుకి మూడు షిప్ట్‌ల్లో పనిచేసేవారట. 52 ఏండ్ల సినీ కెరీర్‌లో సూపర్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు,పండంటికాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు,కురుక్షేత్రం, భలే దొంగలు,మనస్సాక్షి,ఈనాడు,సింహాసనం,ముద్దు బిడ్డ, నంబర్ 1' వంటి చిత్రాలు కృష్ణలోని నటనకు ప్రతిబింబాలు. ఈ చిత్రాలు ఆయనకు గొప్ప పేరును సంపాదించిపెట్టాయి. సాక్షి సినిమా అయితే.. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది.
దర్శక, నిర్మాతగా..
మొత్తంగా 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ..వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు.తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్‌గ్రీన్ రికార్డూ కృష్ణకే సొంతం.తన సినీ జీవితంలో వందకు పైగా దర్శకులతో పనిచేశారు. కృష్ణ దాదాపు 80మందికిపైగా హీరోయిన్లతో నటించారు. విజయనిర్మలతో 48 సినిమాలు, జయప్రదతో 47 చిత్రాలు, శ్రీదేవితో 31 చిత్రాలు,రాధతో 23 చిత్రాల్లో నటించారు.
