జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది?..14 సార్లు బీ ఫామ్ ఇచ్చి గౌరవించింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది?..14 సార్లు బీ ఫామ్ ఇచ్చి గౌరవించింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • గతంలో కేసీఆర్​ అవినీతిపై చేసిన ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు
  •     సీఎం దిగిపోవాలనడానికి మీరెవరు?..పొంగులేటిపై బీఆర్ఎస్​వి తప్పుడు ఆరోపణలు
  •     ఆధారాలుంటే తీసుకుని గాంధీభవన్​కు రావాలని హరీశ్​రావుకు సవాల్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ను విమర్శించే ముందు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌పై ఇదివరకు చేసిన విమర్శలకు జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తక్కువేం చేయలేదని, ఆయనకు ఇప్పటి వరకు 14 సార్లు బీఫామ్ లు ఇచ్చి గౌరవించిందని స్పష్టం చేశారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. జీవన్ రెడ్డి విమర్శలను ఎవరూ పట్టించుకోరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అవినీతిపై పలుసార్లు జీవన్ రెడ్డి ప్రశ్నించారని, వాటికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని అన్నారు. 

పదేండ్లు అధికారంలో ఉండి దోచుకొని ఇప్పుడు మా మంత్రులపైనే ఆరోపణలు చేస్తారా? అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ దోపిడీ గురించి కవితనే చెప్తున్నదన్నారు. మంత్రి పొంగులేటిపై ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలు ఉంటే తీసుకొని గాంధీ భవన్ కు వస్తే చర్చిస్తామని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. నాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుల్ భూముల కుంభకోణం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు మా మీద బట్టకాల్చి మీద వేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క గీత కూడా పడలేదని, బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేండ్లలోనే కూలిపోయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, రెండూ ఒక్కటేనని, రాబోయే రోజుల్లో ఈ రెండూ కలుస్తాయన్నారు. మంత్రివర్గ విస్తరణ సీఎం పరిధి అంశమని, అది ఇప్పట్లో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పనిచేయడమే తనకు సంతోషమని, పీసీసీ చీఫ్ పదవే పవర్ ఫుల్ అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి అంటూ తనపై ఎందుకు ప్రచారం జరుగుతున్నదో తనకు తెలియదన్నారు.