V6 News

పదేండ్ల మోసాలు చెప్పి పాదయాత్ర చెయ్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పదేండ్ల మోసాలు చెప్పి పాదయాత్ర చెయ్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కేటీఆర్​కు పీసీసీ చీఫ్ ​మహేశ్​ గౌడ్ ​సూచన
  • బీఆర్ఎస్​ను టీఆర్ఎస్​గా మార్చినా, బీజేపీ ఆర్ఎస్​గా మార్చినా ప్రజలు నమ్మరని ఎద్దేవా

నిజామాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ ​పాలనలో చేసిన మోసాలను ప్రజలకు చెప్పి పాదయాత్ర చేస్తే బాగుంటుందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​కు పీసీసీ చీఫ్​మహేశ్​గౌడ్​ సూచించారు. బీఆర్ఎస్ హయాంలో తప్పిదాలు జరిగినట్టు ఒప్పుకోవడం సంతోషమే.. అయినా ఆర్థిక దోపిడీ, భూ దోపిడీ, ప్రాజెక్టుల పేరుతో చేసిన నిధుల దోపిడీ, నిరుద్యోగులను గోస పెట్టిన అంశాలను వివరించి యాత్ర షురూ చేయాలన్నారు. సోమవారం నిజామాబాద్ ఆర్​ అండ్​ బీ గెస్ట్​ హౌస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్​ను టీఆర్ఎస్​గా మార్చినా, బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగా బీజేపీ ఆర్ఎస్​గా మార్చినా ప్రజలు నమ్మరని ఎద్దే వా చేశారు. సీఎం రేవంత్ ​రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందుతున్న పేదలు తమ సర్కార్​ను నెత్తిన పెట్టుకుంటున్నారని తెలిపారు. 

కవిత నిజాలు చెప్తున్నరు..

మాజీ సీఎం కేసీఆర్​కూతురు కవిత కుటుంబ ఆస్తుల పంచాదీతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని మహేశ్​గౌడ్​అన్నారు. బీఆర్ఎస్​టైంలో అన్న కేటీఆర్, బావ హరీశ్​రావు, కజిన్ సంతోష్​ రావు రాష్ట్రాన్ని ఎట్ల దోచుకున్నరో ఆమె నిజాలు చెప్తున్నారని తెలిపారు. అయితే, పదేండ్ల కేసీఆర్​పాలనలో కవిత కూడా భాగస్వామేనని పేర్కొన్నారు. ఆమె పెట్టబోతున్న పార్టీకి కాంగ్రెస్​ ఫండింగ్​ చేస్తుందని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​పసలేని ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమకు లేదన్నారు.

అర్వింద్​ మరోసారి గెలవరని, ఎప్పు డూ కులం, మతం, శ్రీరాముడి పేరుతో ఓట్లడిగితే ప్రజలు వేయరని చెప్పారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీతో కలిసి రాజీవ్​గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేశారు. ఈ స్కీమ్​లకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మొద్దన్నారు. ఎవరైనా పైరవీలు చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, డీసీసీ ప్రెసి డెంట్ నగేశ్​రెడ్డి, కాంగ్రెస్ నగర శాఖ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.