V6 News

‘డీలిమిటేషన్’  తీర్పు మోదీకి చెంపపెట్టు

 ‘డీలిమిటేషన్’  తీర్పు మోదీకి చెంపపెట్టు
  • దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ భగ్నం 
  • పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

భూదాన్ పోచంపల్లి, వెలుగు: డీలిమిటేషన్  బిల్లు పార్లమెంట్​లో వీగిపోవడం ప్రధాని మోదీకి చెంపపెట్టు లాంటిదని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్  గౌడ్  తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భూదాన్ ఉద్యమ 75వ వజ్రోత్సవ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలసి పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లిలో భూదానోద్యమంలో మొదటిగా 100 ఎకరాల భూమిని దానం చేసిన  భూదాత వెదిరే రామచంద్రారెడ్డి కాంస్య  విగ్రహాన్ని ప్రారంభించి, వినోబా భావే  మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ మాట్లాడుతూ భూదానోద్యమ స్ఫూర్తితోనే ఇందిరాగాంధి సీలింగ్  యాక్ట్ ను తీసుకొచ్చి బడుగు, బలహీనవర్గాలకు భూములు పంచే కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు.

వెదిరె రాంచంద్రారెడ్డి స్ఫూర్తితో వేల ఎకరాల భూములు ఉన్న భూస్వాములు పేదలకు దానం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా డీలిమిటేషన్  బిల్లులో మహిళా బిల్లును కలిపి పెట్టడం వల్లే పార్లమెంట్​లో వీగిపోయిందని తెలిపారు. ఇకనైనా ప్రధాని ఒంటెత్తు పోకడలు మాని ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి భూదానోద్యమం స్ఫూర్తితో 45 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచడానికి అంకురార్పణ జరిగిందని తెలిపారు. వెదిరే అరవింద్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్  భాస్కరరావు, పోచంపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​ తడక వెంకటేశం పాల్గొన్నారు.