- నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో పోటీకి కసరత్తు
- కాంగ్రెస్‌తో పొత్తుపై నో క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేయాలని ప్లాన్ చేస్తోంది. గతంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితమైన ఆ పార్టీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసింది. రాష్ట్రంలో ముస్టిం మైనార్టీల బలం ఉన్న నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్జిల్లాలోని బైంసాతో సహా పలు మున్సిపాలిటీల్లో మేయర్, చైర్ పర్సన్ స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది.
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపల్కార్పొరేటర్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో పార్టీ, మహారాష్ట్రలో ఇటీవల ముగిసిన సివిక్ ఎన్నికల్లో పాల్గొని అత్యధిక స్థానాలు గెచుకుంది.
ఇన్నాళ్లు దేశవ్యాప్రతంగా పలు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన మజ్లిస్.. తాజాగా మహారాష్ట్రలోని ముంబై, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మంచి అనుభవమే సంపాదించింది. ఇప్పుడు తెలంగాణలో ఫిబ్రవరి నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోసం పోటీ చేయాలని భావించే ఆశావహ అభ్యర్థులను ఆహ్వానిస్తూ.. నాన్-రిఫండబుల్ ఫీతో అప్లికేషన్లు స్వీకరిస్తోంది. గత దశాబ్దకాలంగా జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ వైపు మళ్లాయి.
ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ముందు ముస్టిం మైనార్టీ ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడే పరిస్థితి ఉండేది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత కొన్నాళ్లుగా మజ్లిస్ పార్టీ అధికార పార్టీకి కొంత అనుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే, ఈరెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా? లేదా? అనేది క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు లేక పోతే మజ్లిస్ పోటీతో ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మైనార్టీల బలం ఉన్న ప్రాంతాల్లో పాగా..
ముస్లిం మైనార్టీల బలం ఉన్న నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నందున, మజ్లిస్ ఇక్కడ మేయర్ పదవులను టార్గెట్ చేస్తోంది. ఇటీవల ఎంబీటీ కూడా నిజామాబాద్‌లో యువతను ఎన్నికల్లో పాల్గొనమని పిలుపునిచ్చింది, ఇది మైనార్టీ పార్టీల మధ్య పోటీని సూచిస్తోంది. అదనంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
దీంతో మూడు మేయర్ పదవులు ఏర్పడనున్నాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 44 స్థానాలు గెలిచిన మజ్లిస్ పార్టీ ఈ సారి ఏర్పాటు కానున్న మూడు కార్పొరేషన్లపై పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా, మజ్లిస్ పోటీతో మైనార్టీ ఓట్ల చీలిక అధికారపక్షానికి లాభమా? ప్రతిపక్ష పార్టీకి లాభమా? అనేది ఎన్నికల పొత్తులపైనే ఆధారపడనుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనే దానిపై నేటికీ క్లారిటీ రాలేదు.
పొత్తుపై నో క్లారిటీ..
పార్టీ అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేయాలని ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్‌తో ప్రత్యక్ష పొత్తు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహా రాష్ట్రలో పోస్ట్ -పోల్ అలయన్స్‌లు చేసుకు న్నట్టు, తెలంగాణలోనూ మున్సిపల్ ఎన్నికల అనంతరం మజ్లిస్, కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల తో పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకోవడం వంటి అవకాశాలు లేకపోలేదు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు మజ్లిస్ వైపు మళ్లితే అధికార కాంగ్రెస్‌కు నష్టం జరిగే ప్రమాదం ఉందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆశిస్తోంది.
