- బీజేపీలోకి రాఘవ్ చద్దా
- ఆప్ నుంచి మరో ఆరుగురు ఎంపీలూ చేరుతున్నట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో ఆప్ ఎంపీలు ఏడుగురు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆప్ రాజ్యసభాపక్ష ఉప నేతగా ఇటీవల తొలగించిన రాఘవ్ చద్దాతోపాటు ఆయన స్థానంలో నియమితుడైన అశోక్ మిట్టల్ కూడా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. వీరితోపాటు సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా ఆప్‌కు గుడ్ బై చెప్పారు.
దీంతో ఆప్ కు రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్, సంజయ్ సింగ్, ఎన్ డీ గుప్తా మాత్రమే మిగిలారు. ఈ సందర్భంగా పాఠక్, మిట్టల్‌తో కలిసి చద్దా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తామంతా కలిసి ఒకే వర్గంగా బీజేపీలో చేరనున్నట్టు వెల్లడించారు. ‘రాజ్యసభలో ఆప్‌కు 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది మాతో పాటు బయటకు వచ్చారు.
రాజ్యాంగం ప్రకారం, ఒక పార్టీలోని మొత్తం ఎంపీలలో మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో విలీనం కావచ్చు. దీనికి సంబంధించి అవసరమైన పత్రాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించాం’ అని ఆయన తెలిపారు.
ఆప్ అవినీతిమయమైంది..
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఇప్పుడు దేశం కోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తోందని చద్దా విమర్శించారు. ‘నా యవ్వనంలోని 15 ఏళ్లను ధారపోసి.. నా రక్తం, చెమటతో నేను పెంచి పోషించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తన సూత్రాలు, విలువలు, ప్రధాన నైతికత నుంచి పూర్తిగా పక్కకు తప్పిపోయింది. నేను ఈ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిని. మేం పూర్తి నిబద్ధతతో పంజాబ్, ఢిల్లీ, ఇతర ప్రాంతాలలో పార్టీని స్థాపించాం. ఈ రోజు ఆప్ అవినీతిమయమైంది, రాజీ పడింది. ఆప్ పాత పార్టీ కాదు. ఆప్ తప్పులలో నేను పాలుపంచుకోవాలని అనుకోవడం లేదు’ అని చద్దా ఆరోపించారు. ‘కేజ్రీవాల్ అండదండలతో పార్టీలో పెరుగుతున్న అవినీతిని, మహిళలపై వేధింపులు, దాడులను చూసి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను" అని స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు.
అవినీతికి నిలయంగా ఆప్: బీజేపీ
ఆప్ ఎంపీల చేరికపై బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ.. ఆప్ అవినీతికి నిలయంగా మారిందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయా ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా దారితప్పింది. ఆ పార్టీ పతనం అనేది ఇకపై కేవలం ఊహాగానం కాదు. అది కళ్ళముందే నిజమవుతోంది’ అని పేర్కొన్నారు.

