హైదరాబాద్ KBR పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ KBR పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్‌లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మెయిన్ రోడ్డు మీదకు మంటలు ఎగిసిపడుతుండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు. 

ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో వెంటనే KBR పార్కుకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’ నిర్మాణం జరగనుంది. ఈ క్రమంలో.. కేబీఆర్ పార్కులో అగ్ని ప్రమాద ఘటన కలకలం రేపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఫిలింనగర్ వరకు పూర్తి సిగ్నల్ ఫ్రీ కారిడార్ అందుబాటులోకి వస్తుందని GHMC చెప్పింది. 

రోడ్ నంబర్ ​45, ఫిల్మ్‌ నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధా జంక్షన్లను కలుపుతూ ఈ గ్రేడ్ సెపరేటర్లను నిర్మిస్తామని ప్రకటించింది. దీనివల్ల జూబ్లీహిల్స్– మాదాపూర్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ ఇబ్బందులనే కాకుండా పర్యావరణానికి కూడా పెద్ద ఎత్తున మేలు చేస్తుందని చెప్పింది.