- కుతుబ్ షాహి టూంబ్స్ వద్ద ఎగసిపడ్డ మంటలు
- త్రుటిలో తప్పిన పెను ముప్పు
మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలోని కుతుబ్షాహి టూంబ్స్ ప్రాంతంలో శనివారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న పాత టైర్ల షాపు, మెకానిక్ షెడ్, గ్యాస్ సర్వీసింగ్ సెంటర్, టిఫిన్ సెంటర్కు వ్యాపించడంతో పాత టైర్లు కాలిపోయాయి. టిఫిన్, గ్యాస్ సర్వీసింగ్ సెంటర్లలో సిలిండర్లు పేలి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
ప్రమాద సమయంలో సమీపంలోని మసీదులో రంజాన్ ప్రార్థనల నిమిత్తం భారీగా జనం ఉన్నప్పటికీ.. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు పక్కనే ఉన్న 33 కేవీ సబ్ స్టేషన్కు వ్యాపించి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద విపత్తు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
