
స్వీట్ కార్న్.. దీన్ని నిప్పులపై కాల్చుకుని లేదా నీళ్లలో ఉడికించుకుని కాస్త ఉప్పు, కారం చల్లుకుని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి స్వీట్‌కార్న్‌ని ఇంకాస్త వెరైటీగా తినాలంటే ఈ రెసిపీలు ట్రై చేయాల్సిందే. పొంగనాలు, ఫ్రైడ్ రైస్, పరాటాల్లో స్వీట్‌కార్న్.. పిల్లలతో సహా అందరూ ఇవి తినడానికి పోటీపడతారు తెలుసా! మరింకెందుకాలస్యం.. ఈ రెసిపీల తయారీ వైపు ఓ లుక్కేయండి.
పొంగనాలు
కావాల్సినవి :
స్వీట్‌కార్న్ – ముప్పావు కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు
శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – అర టీస్పూన్, ఉప్పు, నీళ్లు, నూనె – సరిపడా
క్యారెట్, చిన్న క్యాప్సికమ్ – ఒక్కోటి, ఉల్లికాడల తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, ఈనో లేదా ఫ్రూట్ సాల్ట్ – అర టీస్పూన్
తయారీ :
స్వీట్ కార్న్‌ని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలో వేసి అందులో బొంబాయి రవ్వ, శనగపిండి, పసుపు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లికాడల తరుగు, ఈనో లేదా ఫ్రూట్ సాల్ట్ వేసి నీళ్లు పోసి మరోసారి కలపాలి. తర్వాత పొంగనాల పాన్‌లో నూనె వేసి రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఉడికించాలి. ఒకవైపు ఉడికాక మరోవైపు తిప్పివేసి మూతపెట్టి ఉడికిస్తే సరి. కావాలంటే ఈ రెసిపీని పొంగనాల్లా కాకుండా పాన్‌లో నేరుగా పిండి వేసి దిబ్బ రొట్టెలా కూడా చేసుకోవచ్చు.
రైస్
కావాల్సినవి :
స్వీట్ కార్న్ – అర కప్పు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – రెండు
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
ఉల్లిగడ్డ, చిన్న క్యాప్సికమ్, టొమాటో – ఒక్కోటి
ఉప్పు – సరిపడా
మిరియాల పొడి – అర టీస్పూన్
అన్నం – ఒక కప్పు
కరివేపాకు – కొంచెం
తయారీ :
పాన్‌లో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు కూడా వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత స్వీట్ కార్న్ వేసి కలపాలి. కాసేపయ్యాక క్యాప్సికమ్, టొమాటో తరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. చివరిగా అన్నం వేసి బాగా కలపాలి. అంతే.. కలర్ఫుల్గా కనిపించే వేడి వేడి స్వీట్ కార్న్ రైస్ రెడీ. మసాలాలు పెద్దగా లేకపోయినా ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది.
పరాటా
కావాల్సినవి :
గోధుమపిండి, స్వీట్ కార్న్ – రెండు కప్పుల చొప్పున, ఉప్పు – సరిపడా
నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తురుము – ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు, మిక్స్డ్ హెర్బ్స్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – పావు టీస్పూన్,
చీజ్ – ఒక కప్పు
తయారీ :
మిక్సీజార్‌లో స్వీట్ కార్న్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ తరుగు ఒక్కొక్కటిగా వేసి వేగించాలి. తర్వాత అందులో స్వీట్‌కార్న్ పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. కాసేపయ్యాక ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో మిక్స్డ్ హెర్బ్స్, మిరియాలపొడి, చీజ్ వేసి కలపాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసి నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా చేసి చపాతీల్లా వత్తాలి. ఆపై చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి మళ్లీ ఉండలా చుట్టాలి. దాన్ని మరోసారి చపాతీలా సాగదీయాలి. అలా రెడీ చేసుకున్న వాటిని వేడి పాన్ మీద నూనెతో రెండు వైపులా కాల్చాలి.