- హరీశ్‌రావుకు మాల సంఘాల జేఏసీ వినతి
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర అసెంబ్లీలో సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని మాల సంఘాల జేఏసీ నేతలు కోరారు.
ఈ మేరకు జేఏసీ చైర్మన్ డాక్టర్ మందల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, బేర బాలకిషన్, మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రావు నేతృతంలో మాల సంఘాల నేతలు గురువారం హైదరాబాద్‌లో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. 30 లక్షల మంది జనాభా కలిగిన మాల సమాజాన్ని ప్రభుత్వం మోసం చేస్తోందని, ప్రస్తుతం అమలవుతున్న రోస్టర్ విధానం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వర్గీకరణ వల్ల ఎస్సీలలోని 59 కులాలకు అన్యాయం జరుగుతోందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలోని అన్ని రాజకీయ పక్షాలను కలుస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ధర్మపోరాటాన్ని పల్లె పల్లెకూ తీసుకెళ్తామన్నారు.
