మల్లన్న సాగర్ అదనపు టీఎంసీ పనులకు భూములివ్వం

మల్లన్న సాగర్ అదనపు టీఎంసీ పనులకు భూములివ్వం
  • మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్
  • మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలనిడిమాండ్
  • కోర్టును ఆశ్రయించిన మూడు గ్రామాల ప్రజలు
  •  పర్యావరణ అనుమతులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ వరకు అదనంగా మరో టీఎంసీ మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనుల కోసం1500 ఎకరాలు సేకరించాల్సిఉండడంతో రైతుల నుంచి తీవ్రఅభ్యం తరాలు వ్యక్తమవుతున్నాయి. మిడ్ మానేరు నుంచి ప్రస్తుతం ప్రతి రోజు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు మీదుగా కొమురవెల్లి మల్లన్నసాగర్ వరకు ఐదు స్టే జీల్లో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలన్నది ప్రభుత్వం ప్లాన్. రూ. 21,458 కోట్ల అంచనాతో పనులకు ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మిడ్ మానేరు నుంచి కొమురవెల్లి మల్లన్న సాగర్ వరకు దాదాపు 55 కిలో మీటర్ల పనులను నాలుగు స్టేజీల్లో నిర్వహించేందుకు రూ. 11,710 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పది కిలోమీటర్లు, అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నసాగర్ వరకు దాదాపు 45 కిలో మీటర్ల మేర గ్రావిటీ, ఓపెన్ కాల్వలతో పాటు కొంత మేర పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. ఇందులో భాగంగా మూడు సర్జిపూల్ లను నిర్మి స్తున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద నిర్మించిన సర్జిపూల్ నుంచి 45 కి.మీ. దూరం కొమురవెల్లి మల్లన్న సాగర్ వరకు సెపరేట్ రూట్లో కాలువ ద్వారా నీటిని తరలించడానికి అలైన్మెంట్ నిర్ణయించారు. నీటి తరలింపునకు అవసరమైన కాల్వల కోసం సిద్ది పేట జిల్లాలో 1,500 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

 భూసేకరణకు రైతులు నో

అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి చిన్నగుండవెల్లి వరకు 20 కి.మీ. మేర పైప్లైన్, చిన్నగుండవెల్లి నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు గ్రావిటీ కెనాల్స్ నిర్మించాలని ప్రతిపాదించి దాదాపు 1,500 ఎకరాలను సేకరించడానికి అధి కారులు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలోని మొత్తం 17 గ్రామాల్లో కాల్వల నిర్మాణం కోసం భూసేకరణ జరుపుతుండగా కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. అవసరమైతే డిజైన్లు మార్చుకోవాలే తప్ప భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి అధికారులు గ్రామ సభలు నిర్వ హించగా భూములు ఇవ్వడానికి రైతులెవ్వరూ అంగీకారం తెలపలేదు. భూసేకరణకు నోటీసులు జారీ చేయడంతోపాటు గ్రామ సభలను నిర్వహించి అవార్డు ఎంక్వయిరీ ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు సేకరించే భూములకు ఇచ్చే పరిహారం విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వకుండా పనులు ప్రారంభించాలనే ప్రయత్నాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట మండలం చిన్న గుండవెల్లి వద్ద సర్వే సిబ్బందిని రైతులు అడ్డుకుని వెనక్కి పంపారు. అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ చిన్నకోడూరు మండలం రామంచ, సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి , తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామాలకు చెందిన 300 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక భూసేకరణ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పారలర్ కెనాల్ కోసం జిల్లాలో 1,500 ఎక రాలను సేకరించాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి అవార్డు ఎంక్వయిరీ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు.

పైప్ లైన్ పనులు ఎట్లా?

అదనపు టీఎంసీ పనుల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో దాదాపు 20 కి.మీ. మేర పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించాలని అధికారులు నిర్ణయించారు. భూ సేకరణ సమస్యగా మారుతుండటంతో రైతుల పొలాల్లోంచి పైప్ లైన్లను వేసి పనులు జరిపే సమయంలో మాత్రమే ఆ సీజన్ లో రైతు నష్ట పోయిన పంటకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినా అది ఎంతవరకు ఆమోదయోగ్యం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల రైతునుంచి భూమి తీసుకునే అవసరం లేకున్నా భవిష్యత్తులో పైప్ లైన్ వేసిన చోట సమస్య ఏర్పడితే ఏంటనే అనుమానాలు అధికారుల్లో వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో ఈ స్థలాల్లో రైతులు ఎవైనా నిర్మాణాలు చేపడితే ఎలా అనే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు అదనపు టీఎంసీ పనులకు పర్యావరణ అనుమతులు పొందలేదంటూ సిద్దిపేటకు చెందిన లాయర్ తుమ్మనల్లి శ్రీనివాస్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు.