కలెక్టర్ల అధికారాలు మంత్రులకు ఇవ్వడం సరికాదు

కలెక్టర్ల అధికారాలు మంత్రులకు ఇవ్వడం సరికాదు

తెలంగాణలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థుల ఎంపిక కూడా తన చేతుల్లోనే ఉందని సీఎం కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేలా ఉందని విమర్శించారు. కలెక్టర్ల అధికారాలు కూడా మంత్రులకు ఇవ్వడం సరికాదని అన్నారు. అభ్యర్థుల ఎంపిక .. ఎన్నుకోవడం అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలని కోరారు.

రెవెన్యూ శాఖపై కుట్రలు: హర్షవర్దన్ రెడ్డి, అధికారప్రతినిధి

రెవెన్యూ శాఖపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి. ‘రెవెన్యూ శాఖలో ఎన్ఐసి స్థానంలో కేటీఆర్ సన్నిహిత వ్యక్తికి చెందిన ధరణి వెబ్సైట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు అది సరిగా పని చేయకపోవడంతో రెవెన్యూ శాఖపై కుట్రలు చేస్తున్నారు. విద్యాశాఖలో ఒక్క పోస్టుని భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ సంఘాలను ఎత్తివేయాలని చూస్తున్నారు. అన్ని శాఖల్లో ఇన్ ఛార్జుల పాలన సాగుతోంది‘. అని విమర్శించారు హర్షవర్దన్.