మామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఘన విజయం

మామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఘన విజయం
  • 163 అసెంబ్లీ స్థానాల్లో వికసించిన కమలం
  • 66 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
  • గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పెరిగిన 50 సీట్లు

భోపాల్: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ‘మామ’ మళ్లీ మ్యాజిక్ చేసిండు. అభిమానులు మామా అని పిలుచుకునే శివరాజ్ సింగ్​ చౌహాన్​ తనకు అలవాటైన రీతిలో ఇంకోసారి బీజేపీని గెలిపించిండు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి, పదేండ్ల కిందటి ఫలితాలను రిపీట్ చేస్తూ భారీగా సీట్లను సాధించిండు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోని బీజేపీ.. ఏకంగా 163 సీట్లు సాధించింది. 230 సీట్లున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 116 కాగా.. అందుకు మరో 47 సీట్లను ఎక్కువే గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని భావించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం 66 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. భారత్ ఆదివాసీ పార్టీకి ఒక సీటు వచ్చింది. బీజేపీ గెలుపుతో భోపాల్‌‌‌‌‌‌‌‌లోని ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. క్రాకర్లు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కార్యకర్తలు, నేతలతో కలిసి పార్టీ స్టేట్ చీఫ్ వీడీ శర్మ డ్యాన్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆఫీసు నిశబ్దంగా కనిపించింది.

కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమైనప్పటి నుంచి..

నవంబర్ 17న జరిగిన ఎన్నికలో 77.82 శాతం పోలింగ్‌‌‌‌‌‌‌‌ నమోదైంది. ఆదివారం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ హవా కొనసాగింది. మెజారిటీ అంతకంతకూ పెరిగిపోయింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా బీజేపీకి 48.55% ఓట్లు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 40.40% ఓట్లు పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 7.5% ఓట్లు పెరగ్గా.. 50 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇక కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు గత ఎన్నికలతో పోలిస్తే 0.49 శాతం ఓట్లు మాత్రమే తగ్గినా.. ఏకంగా 48సీట్లు తగ్గాయి. ఇక బీఎస్పీకి 3.34 శాతం, ఇతరులకు 5.5 శాతం, నోటాకు 0.98 శాతం ఓట్లు పడ్డాయి. బుద్నీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్.. 1,04,974 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్ (దిమానీ), ప్రహ్లాద్ సింగ్ పటేల్(నార్సింగ్​పూర్) కూడా విజయం సాధించారు.

2013లో మాదిరే

2013లో సాధించిన ఫలితాల మాదిరే బీజేపీ ఇప్పుడు సీట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లలో గెలిచింది. 44.88 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ మాత్రం 58 స్థానాలకే పరిమితమైంది. 36.38 శాతం ఓట్లు పడ్డాయి. ఇక 2018లో 40.89 శాతం ఓట్లతో 114 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువగా 41.02 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. సీట్లను మాత్రం 109 మాత్రమే గెలుచుకోవడం గమనార్హం.

వరుసగా తొమ్మిదో సారి.. ప్రచారం చేయకుండానే..

బీజేపీ సీనియర్ నేత గోపాల్ భార్గవ.. రికార్డు స్థాయిలో వరుసగా 9వ సారి విజయం సాధించారు. రెహ్లీ సీటు నుంచి పోటీ చేసిన ఆయన.. 72,800 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్‌‌‌‌‌‌‌‌పై గెలుపొందారు. 1985లో తొలిసారి రెహ్లీ నుంచి గెలిచిన ఆయన.. అప్పటి నుంచి 38 ఏండ్లుగా గెలుస్తూనే ఉన్నారు. 2003 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. 71 ఏండ్ల భార్గవ.. ఎన్నికల్లో కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. తాను ఎలాంటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, పదవిలో ఉండే ఐదేండ్లపాటు ప్రజలకు సేవ చేయడాన్నే నమ్ముతానని ఆయన చెప్పారు.

ప్రజల నమ్మకాన్ని  నిలబెట్టుకోవాలె: కమల్‌‌‌‌‌‌‌‌నాథ్

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకోవాలని చెప్పారు. ‘‘ఓటర్ల నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా మా డ్యూటీని కొనసాగిస్తాం. బీజేపీకి శుభాకాంక్షలు” అని చెప్పారు. మధ్యప్రదేశ్ ఓటర్లపై తాను విశ్వాసం ఉంచానని, ఈరోజు కూడా అది అలానే ఉందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేయదని భావిస్తున్నానని చెప్పారు.