V6 News

ఏసీబీకి చిక్కిన మామడ ఎస్సై .. స్టేషన్​ బెయిల్ ​కోసం రూ.10 వేల లంచం డిమాండ్​

ఏసీబీకి చిక్కిన మామడ ఎస్సై .. స్టేషన్​ బెయిల్ ​కోసం రూ.10 వేల లంచం డిమాండ్​
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

లక్ష్మణచాంద(మామడ), వెలుగు : ఓ కేసు విషయంలో స్టేషన్​ బెయిల్​ఇస్తానంటూ రూ.10 వేలు లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా మామడ ఎస్​ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..నిర్మల్​ జిల్లా మామడ మండలంలోని అనంతపేటకు చెందిన సల్కం సతీశ్, సల్కం సురేశ్ అన్నదమ్ములు. ఇదే గ్రామానికి చెందిన సుప్పరి నరేశ్ అనే కిరాణా షాప్ యజమానితో ఈ నెల 24న గొడవ పడ్డారు.

ఈ విషయమై నరేశ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా..సతీశ్, సురేశ్ లపై ఐపీసీ 323,341,291 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇటీవలే బాధ్యతలు తీసుకున్న మామాడ ఎస్సై రాజు స్టేషన్ బెయిల్​ ఇస్తానని నిందితులను రూ.10 వేల లంచం అడిగాడు. దీంతో నిందితుల అన్న సల్కం తిరుమల్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆదివారం ఎస్సై రాజుకు లంచం ఇస్తుండగా రైడ్​ చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.  ఎస్సై రాజును విచారించి ఏసీబీ కోర్టుకు తరలించారు.