- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
- పాక్ బెదిరింపులపై ప్రధాని ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మరో పహల్గామ్ దాడికి బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ ప్రజలను ఢిల్లీ లక్ష్యంగా చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం ఆమె నదియా జిల్లాలోని బెతువాదహరిలో నిర్వహించిన బహిరంగ సభ మాట్లాడారు. " కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగానే హెచ్చరించారు.
మరి ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హెచ్చరికలపై కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెబుతామని ఎందుకు అనలేదు? ప్రధాని మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఎన్నికల్లో గెలవడం కోసం గతంలో పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తరహాలో బెంగాల్లో ఏదైనా దాడి జరగాలని ముందే ప్లాన్ (బ్లూప్రింట్) సిద్ధం చేశారా? మా బెంగాల్ ప్రజలను, కోల్‌కతాను టార్గెట్ చేస్తామంటే భారత పౌరులుగా అస్సలు సహించబోం.
ఢిల్లీ గనుక బెంగాల్‌పై దాడికి దిగితే.. బెంగాల్ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతుంది. దేశ భద్రత విషయంలో పాకిస్తాన్ నుంచి అంత పెద్ద బెదిరింపు వస్తున్నా మీరు మాత్రం ఏమీ తెలియనట్లు మౌనంగా కూర్చున్నారు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేశ రక్షణ గురించి మాట్లాడలేని మీరు వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి" అని మోదీపై మండిపడ్డారు.
బ్లూప్రింట్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ తప్పుపట్టారు. "అత్యంత కిరాతకమైన పహల్గామ్ ఉగ్రదాడిని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక స్క్రిప్ట్, బ్లూప్రింట్ అని పిలవడం సిగ్గుచేటు. ఉగ్రవా దాన్ని కూడా రాజకీయం చేస్తున్న మమతకు ప్రజలే బుద్ధి చెప్తారు" అని ట్వీట్ చేశారు.
