బట్టతలకు విగ్గు పెట్టుకుని ప్రేమ పేరుతో ట్రాప్

బట్టతలకు విగ్గు పెట్టుకుని ప్రేమ పేరుతో ట్రాప్
  • ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్​లో యువతులతో  పరిచయాలు
  • బంగారం, డబ్బుతో ఎస్కేప్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్

హైదరాబాద్‌‌,వెలుగు:  లవ్, రిలేషన్ షిప్ పేరుతో యువతులను ట్రాప్ చేస్తూ వారి దగ్గరి నుంచి బంగారం, డబ్బు తీసుకుని ఎస్కేప్ అవుతున్న నిందితుడిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 9 లక్షల విలువైన బంగారు నగలు, 2 సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌‌ గోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన షేక్‌‌ మహ్మద్ రఫి అలియాస్ కార్తీక్‌‌ వర్మ(29) పాలిటెక్నిక్ కోర్సును మధ్యలోనే ఆపేశాడు. 2010  ఆగస్టులో సిటీకి వచ్చి ప్రైవేటు జాబ్ చేశాడు. 2017లో నెల్లూరు జిల్లా గూడూరుకి చెందిన యువతిని పెండ్లి చేసుకున్నాడు. భార్యను కట్నం కోసం వేధించడంతో ఆమె గూడూరులో మహ్మద్ రఫిపై కేసు పెట్టింది. దీంతో భార్యను గూడూరులోనే వదిలేసి రఫి సిటీకి వచ్చాడు. ఈజీ మనీ కోసం యువతులను ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ‘కార్తీక్ వర్మ196’ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. బట్టతలకు విగ్గు పెట్టుకుని ఆ ఫొటోలను ఫేస్ బుక్, ఇన్ స్టాలో తాను ట్రాప్ చేసిన యువతులకు పంపేవాడు. తాను యూఎస్​లో పుట్టానని, చిన్నతనంలోనే హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యానని,  తల్లి సింగపూర్‌‌‌‌లో డాక్టర్‌‌‌‌గా పని చేస్తోందని వారితో చెప్పేవాడు. తన ట్రాప్ లో పడ్డ యువతులను పెండ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. లవ్, రిలేషన్ షిప్ పేరుతో కొంతకాలం గడిపిన తర్వాత యువతుల నుంచి బంగారం, వెండి, డబ్బు తీసుకుని, వాళ్ల ఫోన్‌‌ నంబర్లను  బ్లాక్ లిస్ట్‌‌లో పెట్టి  తప్పించుకుని తిరిగేవాడు. ఇలా ఎస్‌‌ఆర్‌‌‌‌నగర్‌‌‌‌కి చెందిన ఓ యువతిని మహ్మద్ రఫి మోసం చేశాడు. బాధితురాలి కంప్లయింట్​తో పోలీసులు కేసు ఫైల్ చేశారు. నార్త్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం మహ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు.