చున్నీతో ఉరివేసి చంపిన యువకుడు

చున్నీతో ఉరివేసి చంపిన యువకుడు

వనపర్తి జిల్లాలో దారుణం

వనపర్తి, వెలుగు: తనను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించిన యువతిని.. ఓ యువకుడు నమ్మించి హత్యచేశాడు. చున్నీని మెడకు బిగించి అతి దారుణంగా చంపేశాడు. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలంలోని మానాజీ పేటలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన, గురువారం బయటపడింది. కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి, మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాటేదాన్ కు చెందిన సాయి ప్రియ (19)కు మానాజీ పేట గ్రామానికి చెందిన బత్తుల శ్రీశైలం యాదవ్ తో ఐదేండ్లుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి పెండ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో కొంతకాలం కింద దూరమయ్యారు. కానీ సాయిప్రియను మరిచిపోలేకపోయిన  శ్రీశైలం ఇటీవల ఆమెకు తరుచూ ఫోన్​ చేస్తున్నాడు. చివరిసారిగా చూడాలని ఉందని,  ఒక్కసారి రావాలని, లేదంటే  చచ్చిపోతానని బెదిరించడంతో సాయిప్రియ  మూడు రోజుల క్రితం కాటేదాన్ నుంచి భూత్పూర్ ​వచ్చింది. అక్కడికి చేరుకున్న శ్రీశైలం ​, సాయిప్రియను తన సొంత గ్రామం మానాజీపేటకు తీసుకువెళ్లాడు.  

ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని శ్రీశైలం ఒత్తిడి తేగా,  తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ యువతి నిరాకరించినట్లు తెలిసింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహించిన శ్రీశైలం యాదవ్​, సాయిప్రియను  ఆమె చున్నీతోనే ఉరి వేసి చంపేశాడు. తర్వాత తన స్నేహితుడు శివతో కలిసి శవాన్ని పక్కనే ఉన్న గుట్టల్లో పూడ్చి పెట్టాడు. ఈలోగా తమ కూతురు కనిపించడం లేదంటూ సాయిప్రియ తల్లిదండ్రులు కాటేదాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయడంతో జరిగిన ఘోరం గురువారం వెలుగుచూసింది. దీంతో శ్రీనివాస్ ను అరెస్టు చేసి గుట్టల్లో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. కాటేదాన్  ఏరియా మైలదేవరపల్లి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.