ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్.. కొడుకు, కూతురును గొంతు పిసికి హత్య..

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్..  కొడుకు, కూతురును గొంతు పిసికి హత్య..
  • ఆపై ఉరేసుకొని తండ్రి 
  • భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో దారుణం
  • సంగారెడ్డి జిల్లా మల్కాపూర్​లో ఘటన
  • కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సంగారెడ్డి/ కొండాపూర్​, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను గొంతునులిమి చంపిన తండ్రి.. తర్వాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఐదు రోజుల కింద జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.  కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన బాయికాడి సుభాష్ (45) కొంతకాలంగా మల్కాపూర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రైమరీ హెల్త్​ సెంటర్​లో ల్యాబ్​ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు.

అయితే, కుటుంబ కలహాల కారణంగా భార్య మంజులతో సుభాష్ కు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంజుల  పుట్టింటికి వెళ్లిపోవడంతో సుభాష్  పిల్లలతో కలిసి  ఉంటున్నాడు. మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని నిర్ణయించుకుని, 5 రోజుల క్రితం ముందుగా కొడుకు రిథిక్ మర్యాన్(9), కూతురు ఆరాధ్య (5)లను  గొంతు పిసికి హత్య చేశాడు. ఆపై తాను  ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో  ఇంటి ఓనర్  డోర్ పగులగొట్టి చూసేసరికి ముగ్గురి  శవాలు కుళ్లిపోయి ఉన్నాయి.   సమాచారం అందుకున్న కొండాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

10 పేజీల సూసైడ్ నోట్

పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న  సుభాష్.. 10 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం ఉన్నట్టు లేఖలో పేర్కొన్నాడు. ఈ  విషయంలోనే  తరచూ గొడవలు జరిగేవని, ఇంట్లో సీసీ  కెమెరాలు అమర్చితే తాను లేనప్పుడు వాటిని ఆఫ్ చేసేదని తెలిపాడు.  తనకు మంజులతో మూడో వివాహం కావడంతో.. తనపై కూడా అనుమానం పెంచుకొని గొడవలు పడుతూ తరచూ  పుట్టింటికి వెళ్లేదని పేర్కొన్నాడు. ఈసారి కూడా తనతో గొడవపడి పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిందని, జీవితంపై విరక్తి కలగడంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు  లేఖలో వెల్లడించాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం: డీఎంహెచ్​వో

విజయలక్ష్మి హాస్పిటల్​ను రంగారెడ్డి డీఎంహెచ్​వో వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. ప్రాథమికంగా విచారణ జరిపిన ఆయన.. హాస్పిటల్​ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రీట్​మెంట్ తీసుకుంటున్న రోగులను వనస్థలీపురం ఏరియా హాస్పిటల్​కు తరలిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.