మరదలిని ప్రేమిస్తున్నాడని గొంతు కోసి చంపిండు

మరదలిని ప్రేమిస్తున్నాడని గొంతు కోసి చంపిండు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డలో దారుణం జరిగింది. మరదలిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బావ.. తన చిన్ననాటి స్నేహితుడిని గోంతు కోసి హత్య చేశాడు. ఐదుగురు ఫ్రెండ్స్​తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. మర్డర్ చేసిన ఆరుగురిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ అశోక్​తో కలిసి డీసీపీ రష్మి పెరుమాల్ బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బేగంపేటలోని పాటిగడ్డలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ మహ్మద్ ఇజాజ్ (26), షేక్ ఉస్మాన్ (26) చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. 

మహ్మద్ ఇజాజ్​కు నేహా అనే మరదలు ఉంది. షేక్ ఉస్మాన్, నేహా ఇద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇజాజ్​కు తెలిసింది. ఇద్దరినీ హెచ్చరించి ఫోన్ నంబర్లు బ్లాక్ చేయించాడు. నేహా తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నట్టు షేక్ ఉస్మాన్ తెలుసుకున్నాడు. నేహా తన నుంచి ఎక్కడ దూరం అవుతుందో అని.. సంబంధాలు చెడగొట్టేందుకు ఆమె పేరు మీద స్నాప్​చాట్​లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు మెసేజ్​లు పెట్టాడు. 

ముఖంపై కత్తితో దాడి

ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం ఆరు గంటల టైమ్​లో షేక్ ఉస్మాన్, అతని తల్లి, సోదరుడు హుస్సేన్ కలిసి ఇజాజ్ ఇంటికి వెళ్లారు. నేహాను ఉస్మాన్​కు ఇచ్చి పెండ్లి చేయాలంటూ ఇజాజ్ భార్యతో గొడవపడ్డారు. ఈ విషయం ఇజాజ్​కు తెలియడంతో తన ఫ్రెండ్స్​తో కలిసి ఉస్మాన్ ఇంటికెళ్లి ప్రవర్తన మార్చుకోవాలని అతన్ని బెదిరించాడు. తర్వాత ఇజాజ్.. తన ఫ్రెండ్స్ అయిన పాటిగడ్డకు చెందిన మెకానిక్ మహ్మద్ ఫెరోజ్ (24), క్లాత్ స్టోర్​లో సేల్స్ బాయ్​గా పని చేస్తున్న సాహిల్ ఖాన్ (19), స్విగ్గీ డెలివరీబాయ్​గా ఉన్న మహ్మద్ ఫజల్ (20), ట్రావెల్ ఏజెంట్ ఎండీ రషీద్ (18), మరో మైనర్​ను కలిశాడు. 

ఉస్మాన్ చంపేందుకు స్కెచ్ వేశాడు. మంగళవారం రాత్రి 11.40 గంటలకు ఉస్మాన్.. తన చెల్లితో కలిసి బైక్​పై పాటిగడ్డ ఆటో స్టాండ్ నుంచి వస్తున్నాడు. గణేష్ మండపం వద్దకు రాగానే.. ఉస్మాన్​ను అడ్డగించి పక్కనే ఉన్న గ్రౌండ్​లోకి లాకెళ్లారు. ఇజాజ్ అతని గొంతు కోసి ముఖంపై కత్తితో దాడి చేసి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి అందరూ పారిపోయారు. 

మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఐదుగురిని రిమాండ్ కు పంపి.. మైనర్​ను జువైనల్ హోమ్​కు తరలించారు. ఇజాజ్ నుంచి ఉస్మాన్​కు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంక్వైరీలో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు.