ఎయిడ్స్‌‌ ఇంజక్షన్‌‌ బాధితురాలు సూసైడ్‌‌

ఎయిడ్స్‌‌ ఇంజక్షన్‌‌ బాధితురాలు సూసైడ్‌‌
  • ప్రేమను నిరాకరించిందన్న కోపంతో గతంలో ఎయిడ్స్‌‌ రక్తం ఎక్కించిన యువకుడు
  • అవమానంతో ఆత్మహత్య

ఘట్కేసర్, వెలుగు : తన ప్రేమను నిరాకరించడమే కాకుండా, వేరే వ్యక్తితో ఎంగేజ్‌‌మెంట్‌‌ చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు తన మరదలికి ‘ఎయిడ్స్‌‌ రక్తం’ ఎక్కించగా.. ఆ అవమానం భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్‌‌ జిల్లా అన్నోజిగూడలో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన మనోహర్‌‌ అన్నోజిగూడలో ఉంటున్నాడు. అదే కాలనీలో ఉంటున్న తన మరదలు రమణి (22)ని ప్రేమించి పెండ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే మనోహర్‌‌కు హెచ్‌‌ఐవీ ఉందని తెలియడంతో పెండ్లికి యువతి కుటుంబసభ్యులు నిరాకరించారు.

యువతికి కూడా హెచ్‌‌ఐవీ సోకితే తనకే ఇచ్చి పెండ్లి చేస్తారన్న ఆలోచనతో.. మనోహర్‌‌ గత నెల 11న తన శరీరంలోని రక్తాన్ని సిరంజీలోకి తీసుకుని రమణి శరీరంలోకి ఎక్కించాడు. దీంతో అవమానానికి గురైన రమణి శుక్రవారం సూసైడ్‌‌ నోట్‌‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ‘అమ్మా నన్ను క్షమించు.. మనోహర్‌‌ అనే మృగం నా జీవితాన్ని ఆగం చేశాడు. వాడికి హెచ్‌‌ఐవీ ఉందని తెలిసినా ఏమీ కాదంటూ నన్ను మోసం చేశాడు. సమాజంలో నా గౌరవం, విలువ పోయాయి. ఈ అవమానంతో బతకలేను’ అంటూ సూసైడ్‌‌ నోట్‌‌లో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోచారం సీఐ కనకయ్య తెలిపారు.