చేవెళ్ల, వెలుగు: మొబైల్ ఫోన్ చోరీ చేసి పాస్ వర్డ్ చెప్పలేదని ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి చేవెళ్ల బస్టాండ్ వద్ద 45 ఏండ్ల వ్యక్తి ఉండగా, అతడి మొబైల్ ఫోన్‌ను చోరీ చేశారు.
ఇది గుర్తించిన సదరు వ్యక్తి తన ఫోన్ తనకు ఇవ్వాలని లేకపోతే పోలీసులకు చెప్తానని హెచ్చరించాడు. దీంతో అతడిని మభ్యపెట్టి చేవెళ్ల మున్సిపల్పరిధిలోని కందవాడ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ షెడ్‌లోకి తీసుకెళ్లి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేశారు. బాధితుడు నిరాకరించడంతో ముందు చేతులతో, తర్వాత కర్రలతో చితకబాదారు.
ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత బాధితుడి మొబైల్ ఫోన్‌ను డంపింగ్ యార్డులో కాలుతున్న చెత్తలో పడేసి పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలను సేకరించారు.
గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తానే నిందితుడినని పీఎస్లో లొంగిపోయాడు. నిందితుడిని విచారిస్తున్నామని, ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని చేవెళ్ల సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదని, బంధువులెవరైనా గుర్తిస్తే పీఎస్లో సంప్రదించాలని కోరారు.
