హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

హైదరాబాద్ లో  లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
  •     రూ.3 వేల కోసం వేధించిన ఏజెంట్లు    
  •     డబ్బులు కట్టకపోతే న్యూడ్​ఫొటోలు పంపుతమని మార్ఫింగ్ ఫొటోతో బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్ 
  •     తట్టుకోలేక హైదరాబాద్​లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ముషీరాబాద్, వెలుగు: యాప్​ లోన్​కు మరో యువకుడు బలయ్యాడు. లోన్​డబ్బులు కట్టకపోతే మార్ఫింగ్ ​చేసి న్యూడ్ ​ఫొటోలు బంధువులకు పంపుతామంటూ వేధించడంతో హైదరాబాద్​లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన ప్రేమ్ కుమార్ (36), నాగమణి దంపతులు కొంతకాలంగా హైదరాబాద్ రాంనగర్​లో ఉంటున్నారు. ప్రేమ్ కుమార్ క్యాంటీన్లకు అవసరమైన మెటీరియల్ సప్లై చేస్తుండగా.. నాగమణి ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లోని ఓ హాస్పిటల్ క్యాంటీన్​లో పని చేస్తోంది. ప్రేమ్​కుమార్ ​కొంతకాలం కింద ఓ యాప్ ​నుంచి పర్సనల్​లోన్​ తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఒక నెల ఈఎంఐ కట్టలేదు. ఇటీవలే తన భార్య నాగమణితో కలిసి మేడారం జాతరకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో లోన్​ యాప్ ​ఏజెంట్లు ప్రేమ్​కుమార్​కు కాల్​చేశారు. లోన్​డబ్బులు కట్టాలని, లేకుంటే.. ఫొటోలు మార్ఫింగ్​ చేసి మీ బంధువులుకు పంపుతామని బెదిరించారు. ప్రేమ్​కుమార్ ​న్యూడ్ ఫొటోలు, వీడియోలు అతని వాట్సాప్​కు పంపించారు. దీంతో షాక్​కు గురైన ప్రేమ్​కుమార్ ​కట్టాల్సింది రూ.3 వేలే అని, కొంచం టైం ఇస్తే కడతానని బతిమిలాడుకున్నాడు. 

కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్

డబ్బులు చెల్లించేందుకు కొంత  సమయం ఇవ్వాలని ప్రేమ్​కుమార్​ రిక్వెస్ట్​ చేసినా ఏజెంట్లు వినలేదు. పది నిమిషాలు, అరగంట, గంట అంటూ డెడ్​లైన్లు పెట్టి కట్టకపోతే అతడి ఫోన్​లో ఉన్న కాంటాక్ట్స్​అన్నింటికీ ఆ ఫొటోలు, వీడియోలు పంపుతామని బెదిరించారు. దీంతో ఇదే విషయం తన భార్యకు చెప్పాడు. ‘ఇట్లా బ్లాక్​మెయిల్​ చేసేవారికి డబ్బులు పంపిస్తే వాళ్లు వదలరు. వేధిస్తూనే ఉంటరు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేద్దాం’ అని చెప్పింది. బంధువులకు కూడా చెప్పగా వారు ఏమీ కాదని, భయపడవద్దని ధైర్యం చెప్పారు. అయితే, ఎజెంట్లు కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్​​చేస్తూ బెదిరిస్తుండడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. తన పరువు పోతుందని మనోవేదనకు గురైన ప్రేమ్ కుమార్ మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నాగమణి డ్యూటీకి వెళ్లి  రాత్రి 8:30కు ఇంటికి వచ్చింది. డోర్​కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్పాట్​కు చేరుకున్న పోలీసులు ఇంటి కిటికీలు పగలగొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ గదిలో ఉరి వేసుకున్న ప్రేమ్ కుమార్ కనిపించడంతో మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. ప్రేమ్ కుమార్ ఫోన్ ల్యాబ్​కు పంపించామని.. లోన్​ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఏ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్​ వచ్చాయి అన్నది విచారణలో తెలుస్తుందని సీఐ మల్లేశం తెలిపారు.