పోలీసుల హింస తట్టుకోలేక...

పోలీసుల హింస తట్టుకోలేక...
  • దొంగతనం కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టిన పోలీసులు
  • పారిపోయేందుకు దూకగా తీవ్ర గాయాలు
  • చికిత్స పొందుతూ మృతి

ఎంజీఎం, వెలుగు: వరంగల్​మిల్స్ ​కాలనీ పోలీసుల హింస తట్టుకోలేక గత ఆదివారం అర్ధరాత్రి పీఎస్​మొదటి అంతస్థు నుంచి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి గాయపడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ గాంధీనగర్​లోని అబ్బనికుంటకు చెందిన దళితుడు కుమారస్వామి, కుమార్​ఇల్లు షిఫ్టింగ్​కార్మికులుగా పని చేస్తుంటారు. ఈ నెల ఆరో తేదీన ఓ ఇంటి సామగ్రి తరలించేందుకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటి యజమానులు తమ బంగారం పోయిందని వరంగల్​లోని మిల్స్​కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుమారస్వామితో పాటు కుమార్​ను తీసుకువచ్చి ఇంటరాగేషన్​మొదలుపెట్టారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా వినలేదు. తెల్లారి కూడా పోలీసులు వీరిని తమదైన పద్ధతిలో విచారించారు. పోలీసుల ట్రీట్​మెంట్​తో కుమారస్వామి కాళ్లు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి తప్పించుకోవడానికి పోలీస్ స్టేషన్​మొదటి అంతస్తు పై నుంచి దూకాడు. కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని పోలీసులు వరంగల్​ఎంజీఎం దవాఖానాకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​లోని నిమ్స్​దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. 

నిందితుల మధ్య గొడవతోనే ఇలా.. 

కుమారస్వామి మృతి విషయంలో పోలీసుల కథనం మరోలా ఉంది. ఆరో తేదీన దొంగతనం కంప్లయింట్​ రావడంతో కేసు నమోదు చేసి కుమార్ తో పాటు మరో వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించామని వరంగల్​ఏసీపీ గిరికుమార్​చెబుతున్నారు. ఏడో తేదీన కుమార్​, కుమారస్వామి మధ్య గొడవ జరిగిందని, దీంతో కుమారస్వామి స్టేషన్​ బిల్డింగ్​పై నుంచి దూకాడని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు.  దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.