ఓ చిన్న సినిమా తీయాలంటే కూడా కోట్లాది రూపాయల బడ్జెట్, పదుల సంఖ్యలో నటీనటులు, పలువురు టెక్నీషియన్స్ ఉండాలి. కానీ మనలో క్రియేటివిటీ ఉండాలే కానీ అవేవి లేకుండానే ఇప్పుడున్న టెక్నాలజీతో ఓ సినిమానే తీసేయొచ్చు అని దర్శకుడు రాహి అనిల్ బార్వే ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతను ‘తుంబాడ్’ అనే హారర్ థ్రిల్లర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక 33 వేల రూపాయల బడ్జెట్, 80 నిమిషాల నిడివితో ‘మన్ పిశాచ్’ అనే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ తెరకెక్కించిన రాహి.. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశాడు.
మార్చి 18న యూట్యూబ్ ద్వారా సినిమాను విడుదల చేయబోతున్నాడు. యానియా భరద్వాజ్, దీపక్ దామ్లే అనే ఇద్దరు ఆర్టిస్టులతో ఐఫోన్‌లో షూటింగ్ చేసిన రాహి.. ఏఐ టెక్నాలజీ, ఫొటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌ను వాడుతూ ఈ సినిమా పూర్తి చేశాడు. ‘‘డబ్బు లేని ఒక సామాన్య ఫిల్మ్ మేకర్ ఒంటరిగా పూర్తి స్థాయి సినిమాను పూర్తి చేయగలడా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా” అని రాహి బార్వే అన్నాడు.
నిజంగా ఓ ఫిల్మ్ మేకర్‌కు కావాల్సింది బలమైన ఊహాశక్తి, బేసిక్ టూల్స్, ఓపిక, మొండి పట్టుదల మాత్రమేనని.. ఈ చిత్రం చూశాక స్ట్రగుల్స్‌లో ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరైనా శూన్యం నుంచి ఏదైనా సృష్టిస్తే తన ప్రయోగం సక్సెస్ సాధించినట్టేనని రాహి తెలియజేశాడు. సమంత లీడ్ రోల్‌లో తన డైరెక్షన్‌లో ‘రక్త్ బ్రహ్మండ్’ అనే హారర్ మూవీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరగ్గా నిర్మాతలు ఖండించారు.
