మనలో చాలా మంది పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు, ముఖ్యంగా అధునాతన గణిత పాఠాలు రోజువారీ జీవితంలో ఉపయోగపడవని తరచుగా అంటూ ఉంటారు. అయితే ఓ మహిళ ఎత్తును లెక్కించేందుకు ఓ వ్యక్తి త్రికోణమితి సహాయం తీసుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పల్లవి పాండే అనే ట్విట్టర్ యూజర్ తన ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో పాటు.. తన ఎత్తును అంచనా వేయమని కోరారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆమె అడిగిన కోరిక నెరవేరింది. ఓ వ్యక్తి త్రికోణమితిని ఉపయోగించి ఆమె ఎత్తును కనుగొన్నాడు. ఈ విషయాన్ని కూడా పాండే పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి మెట్ల ముందు నిలబడి ఉంది. దాంతో పాటు "నా ఎత్తును అంచనా వేయండి!" అనే క్యాప్షన్ ను కూడా జతచేసింది.
పాండే తన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేయగానే.. చాలా మంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అందులో మిస్టర్ నోబడీ అనే పేరుతో ఉన్న అకౌంట్ అడ్మిన్.. ఆమె ఎత్తును అంచనా వేయడానికి త్రికోణమితిని ఉపయోగించాడు. దాంతో పాటు చూడడానికి "5' 4.5 లాగా ఉంది"... కానీ తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని రాసుకొచ్చాడు. అతను తన లెక్కలను చూపించడానికి ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. ఈ పిక్ చూసిన పాండే ఆశ్చర్యపోయింది. అంతే కాదు అతని ట్వీట్ కు కూడా రిప్లై ఇచ్చింది. కానీ అతను లెక్కించిన ఎత్తు కంటే తాను పొడవుగా ఉన్నానని చెప్పింది. అయితే అతని ప్రయత్నాన్ని కూడా ఆమె ప్రశంసించింది. "హ్యాట్స్ ఆఫ్ యు, మాన్ ఫర్ ఎఫర్ట్స్, కానీ నేను చాలా పొడవుగా ఉన్నాను, కానీ వావ్!!!" అని ఆమె రాసుకొచ్చింది.
