
- ఏం పనులు చేస్తున్నారో చెప్పట్లే
- ఎంపికైన స్కూళ్ల వివరాలియ్యట్లే
- కేంద్ర నిధుల వివరాలు చెప్పాల్సి వస్తుందనే రహస్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ పనులన్నింటినీ గుట్టుగా కొనసాగిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రచారం చేసుకోవాల్సిన సర్కారు.. ఎందుకు దాచిపెడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కీమ్ ద్వారా ఏ జిల్లాలో ఏయే పనులు చేస్తున్నారనే విషయాలనూ బయటకు చెప్పడం లేదు. వెబ్సైట్లోనూ వివరాలను అందుబాటులో పెట్టడం లేదు. అయితే ఈ స్కీమ్‌కు కేంద్రం నిధులే ఎక్కువగా వస్తున్నందున ప్రచారం చేయట్లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
వెబ్ సైట్ లో జీవో కూడా పెట్టలే
రాష్ట్ర వ్యాప్తంగా 26,065 సర్కారు స్కూళ్లుండగా, వాటిలో 20 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. ఆయా బడుల్లో 7,289.54 కోట్లతో మూడు విడతల్లో సౌలతులు కల్పిస్తామని సర్కారు ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్‌లో 9,123 బడులను ఎంపిక చేయగా, వాటిల్లో రూ.3,497.62 కోట్లతో సౌలతులు కల్పిస్తామంటూ ఫిబ్రవరిలోనే జీవో రిలీజ్ చేసింది. కానీ ఏ జిల్లాలో ఎన్ని స్కూళ్లు ఎంపిక చేశారు? వాటిలో ఏయే పనులు చేస్తున్నారనే వివరాలు బయటకు చెప్పడం లేదు.
ప్రభుత్వం ప్రత్యేకంగా మన ఊరు మన బడి కోసం వెబ్సైట్ (manaoorumanabadi.telangana.gov.in) కూడా తెరిచింది. దాంట్లోనూ ఏ వివరాలు పెట్టడంలేదు. కనీసం సర్కారు ఇచ్చిన జీవో కూడా అందుబాటులో లేదు. వెబ్ సైట్లో ఎన్ని స్కూళ్లు ఎంపికయ్యాయి? ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఏయే పనులు చేస్తున్నారు? అనే వివరాలు పొందుపర్చలేదు.
కేవలం మెంబర్ లాగిన్ పేర్లతో స్కూల్స్ కు మాత్రమే లాగిన్స్ ఇచ్చారు. అయితే ఈ స్కీమ్‌కు ఎస్ఎస్ఏ, నరేగా, ఏసీడీపీ, నాబార్డ్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తో పాటు లోకల్ బాడీస్ నిధులను వాడుతున్నట్టు సర్కారు ఇదువరకే ప్రకటించింది. అందుకే దీనిపై పెద్దగా ప్రచారం చేయడం లేదని టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు.
ఏపీలో పబ్లిక్ గా.. ఇక్కడంతా సీక్రెట్ గా
ఏపీలోనూ బడుల్లో సౌలతుల కోసం ‘నాడు–నేడు’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మనఊరు మనబడి స్కీమ్‌కూ అక్కడి సాఫ్ట్‌వేర్‌నే వాడుతున్నారు. నాడు– నేడు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఓ ఆఫీసర్‌ను కేటాయించి.. అక్కడి సర్కారు పనులు కొనసాగిస్తోంది. కానీ తెలంగాణలో ఉన్న అధికారులతోనే నడిపిస్తోంది. ఏపీలో చేసే పనులన్నీ వెబ్ సైట్లో పెడుతూ ప్రజలకు బహిర్గతం చేస్తున్నారు.
సైట్లో జిల్లాల వారీగా, స్కూల్స్, విడతల వారీగా వివరాలన్నీ చెప్పారు. తెలంగాణ వెబ్సైట్ లో అంతా ఖాళీ. దాంట్లో ఏ ఒక్క సమాచారం ఉండటంలేదు. ఏపీలో అక్కడి సీఎం పలుమార్లు దీనిపై రివ్యూ చేయగా, తెలంగాణలో మాత్రం అలాంటివేమీ లేవు. కేవలం ఈ స్కీమ్ ను సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహైస్కూల్లో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ రివ్యూ చేయలేదు.
ఎవ్వరివద్దా వివరాల్లేవ్!
ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. కానీ ఈ పథకం వివరాలను సంఘాల నేతలు, మీడియా ప్రతినిధులు ఎస్ఎస్ఏ అధికారులను అడిగితే, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను అడగాలని చెప్తున్నారు. ఆ డైరెక్టర్‌ను అడిగితే విద్యాశాఖ సెక్రటరీ, మంత్రి దగ్గరే వివరాలుంటాయని అంటున్నారు. మంత్రిని, సెక్రటరీని అడిగితే మళ్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుంచే వివరాలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే, మంచి కార్యక్రమం అని చెప్తున్న సర్కారు.. స్కీమ్ వివరాలను మాత్రం ఎందుకు దాస్తోందని టీచర్ల సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.
అడిగినా వివరాలియ్యలే
ఈ స్కీమ్ కింద ఇప్పటికీ ఒక్క స్కూల్ కూడా రిపేర్ కాలేదు. నిరుడు కేటాయించిన రూ. 3,498 కోట్లలో పైసా ఖర్చు చేయలేదు. ఈ వివరాల కోసం ఆర్థిక శాఖ, విద్యా శాఖ సెక్రటరీలను ఆర్టీఐ ద్వారా అడిగినా తమ వద్ద వివరాల్లేవని తెలిపారు. మొదటి దశలో జరిగిన పనులు, చేసిన ఖర్చుపై ఎవ్వరి వద్ద వివరాలు లేవు. - పద్మనాభరెడ్డి, సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్