ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం ఫోకస్

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం ఫోకస్
  • 11 శాతం ఫిట్‌మెంట్ అమలుకు పే కమిటీ ఏర్పాటు
  • గుర్తింపు సంఘం ఎన్నికల కోసం నేడు లేబర్ కమిషనర్​ను కలవనున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లపై యాజమాన్యం ఫోకస్ ​పెట్టింది. 11 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన అమలుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం ముగ్గురు అధికారులు గీత, సమీరా ఆఫ్రిన్, శిరీషలతో పే కమిటీని నియమించారు. ఈ కమిటీ వచ్చే నెల 10వ తేదీలోపు 2021 వేతన సవరణకు సంబంధించిన కొత్త పే స్కేల్ ను రూపొందించడంతోపాటు వేతన సవరణ విధివిధానాలను సిద్ధం చేసి సంస్థ యాజమాన్యానికి నివేదిక ఇవ్వనుంది. 

ఏయే సంఘాలకు గుర్తింపు దక్కుతుందో!

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపైనా యాజమాన్యం దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏయే కార్మిక సంఘాలకు అర్హత ఉందో తేల్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం కార్మిక శాఖ కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.

ఆర్టీసీలోని కొన్ని యూనియన్లు రెండుగా చీలిన నేపథ్యంలో ఏయే సంఘాలకు గుర్తింపు దక్కనుందనే  చర్చ జోరుగా సాగుతోంది. కార్మిక శాఖ నుంచి పోటీకి అర్హత పొందిన యూనియన్ల జాబితా ఆర్టీసీ యాజమాన్యానికి అందగానే రిటర్నింగ్ అధికారి నియామకం జరగనుంది. జూన్ లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని కొన్ని డిమాండ్లను నేరుగా యాజమాన్యం పరిష్కరించే అవకాశం ఉంది.