న్యూఢిల్లీ: భారత వర్ధమాన టెన్నిస్ ఆటగాడు మానస్ ధమ్నే సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. కజకిస్తాన్‌లోని షిమ్కెంట్‌లో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోయిన్ గిబాడోపై వరుస సెట్లలో విజయం సాధించి, కెరీర్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. క్లే కోర్ట్ టోర్నీలో భాగంగా జరిగిన ఈ పోరులో 18 ఏళ్ల మానస్ దూకుడుగా ఆడి గిబాడోను 6-4, 6-3 తేడాతో ఓడించాడు.
తొలి సెట్‌లో ఆఖరి నిమిషంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యం సాధించిన మానస్.. రెండో సెట్‌లో బేస్‌లైన్ వద్దే ఉండి మ్యాచ్‌ను సులువుగా ముగించాడు. సోమవారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో అతడు టాప్-400లో ఉండే అవకాశం ఉంది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో బెల్జియంకు చెందిన బువాయ్‌సర్ గడమౌరీతో మానస్ తలపడనున్నాడు.
