- మగ్గబెట్టినా పండట్లే.. రుచి తగ్గుతున్న మామిడి పండ్లు
- ముందస్తు కోతలతో తగ్గుతున్న నాణ్యత
- రసాయనాలతో మాగిన పండ్లు ఆరోగ్యానికి హానికరం అంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: పండ్లలో రారాజుగా పేరుగాంచిన మామిడి పండు రుచి తగ్గుతోంది. ఒకప్పటి లాంటి రుచి, తీపి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. చెట్టుపైనే సహజ సిద్ధంగా పండడానికి ముందే కాయలను తెంపుతున్నారు. ఆ తర్వాత వాటిని కెమికల్స్‌తో మగ్గబెడుతున్నారు. దీంతో సహజంగా మామిడి పండులో ఉండే రుచి, తీపి కరువవుతున్నాయని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు.
పక్వానికి రాకముందే కాయలను కోయడం, రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టడం, వాతావరణ మార్పులు, పురుగుల ప్రభావం కలిసి ఈ పరిస్థితికి దారితీశాయని అంటున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తామర పురుగు, తేనె మంచు, అకాల వర్షాల కారణంగా పూత పెద్దఎత్తున రాలిపోయింది. ముఖ్యంగా బంగినపల్లి వంటి ప్రధాన రకాల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.
ఈసారి కాత ఆలస్యంగా రావడంతో పాటు అకాల వర్షాల హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పూర్తిగా పక్వానికి రాకముందే మామిడి కాయలను కోయడం ప్రారంభించారు. చెట్లపై సహజంగా పండాల్సిన కాయలు మధ్య దశలోనే మార్కెట్‌కు చేరుతున్నాయి. వీటిని గోదాముల్లో, రవాణా కేంద్రాల్లో కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో మగ్గబెడుతున్నారు.
ఫలితంగా బయటకు పసుపు రంగులో కనిపించినా లోపల మాత్రం పండు పూర్తిగా పక్వానికి రాకపోవడం కనిపిస్తోంది. తొక్క పక్కన గుజ్జు మెత్తగా ఉన్నా, పిక్క దగ్గర భాగం గట్టిగా, పుల్లగా ఉండటం సాధారణమైందని వినియోగదారులు చెబుతున్నారు. సహజంగా పండిన పండ్లలో ఉండే తియ్యదనం, సువాసన, రసాలు ఈ పండ్లలో కనిపించడం లేదంటున్నారు.
రసాయనాలతో రుచి దెబ్బ..
ఒకప్పుడు వేసవి అంటే మామిడి రుచుల సందడి గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న పండ్లలో సహజమైన తీపి, వాసన, రుచి కనిపించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పండ్లను వేగంగా మగ్గించేందుకు కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఎసిటిలిన్ వాయువును విడుదల చేసి పచ్చికాయను త్వరగా పసుపు రంగులోకి మారుస్తుంది.
అయితే, ఇది కేవలం రంగును మాత్రమే మారుస్తుందని, సహజంగా జరిగే చక్కెర మార్పులు, పోషక విలువల అభివృద్ధి జరగవని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పండ్లలో ఫ్రక్టోజ్ స్థాయిలు తగ్గిపోవడంతో తీపి తగ్గిపోతుంది. పైగా పండ్లు తిన్న తర్వాత గొంతు గీరగా అనిపించడం, కడుపులో అసౌకర్యం, చేదు రుచి వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌లో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ మలినాలు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.
దిగుబడి కోసం హైబ్రిడ్ రకాలే..
అధిక దిగుబడికి హైబ్రిడ్ రకాల సాగు పెరగడం రుచి తగ్గడానికి ఓ కారణమని నిపుణులు అంటున్నారు. సంప్రదాయ రకాల మామిడిలో తీపి లక్షణాలు తగ్గిపోతున్నాయని పేర్కొంటున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో మట్టి సారం దెబ్బతింటోందని, ఇది పండ్ల నాణ్యతపై ప్రభావం చూపుతోందని వివరిస్తున్నారు. చెట్లపై పండిన మామిడిపండ్లనే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కార్బైడ్‌కు బదులుగా ఇథలీన్ గ్యాస్ లేదా సహజ పండ్లతో మగ్గబెట్టే పద్ధతులు పాటించాలని చెబుతున్నారు. పండ్లను 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 85 నుంచి 90 శాతం తేమలో నిల్వ చేస్తే తియ్యదనం, నాణ్యత నిల్వ ఉంటాయని సూచిస్తున్నారు. అసహజ పసుపు రంగు, తొడిమ వద్ద తెల్లటి పొడి, నల్లటి మచ్చలు ఉన్న పండ్లను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
ముందస్తు కోతలతో తగ్గుతున్న రుచి..
వర్షాల భయం, పురుగుల తాకిడితో రైతులు మామిడి కాయలను ముందుగానే తెంపేస్తున్నారు. మెచ్యూరిటీ దశకు వచ్చిన తర్వాతే పండు కోయాలి. మామిడి పండ్లలో సరైన రుచి, తీపి, సువాసన రావాలంటే చెట్టుపైనే పూర్తిస్థాయి పరిపక్వత సాధించాలి. వాతావరణ పరిస్థితులు, సూర్యరశ్మి తీవ్రత, చెట్టుపై కాయ ఉన్న కాలం వంటి అంశాల ఆధారంగా మామిడి మెచ్యూరిటీని నిర్ణయిస్తారు.
బంగినపల్లి రకాన్ని తీసుకుంటే కాయపై లైట్‌గా చిన్న చుక్కలు కనిపించాలి. గాఢ ఆకుపచ్చ నుంచి లైట్ గ్రీన్ రంగులోకి మారాలి. కాయ పైభాగంలో ‘షోల్డర్స్ అప్’అని పిలిచే ఆకృతి రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాతే కాయను కోయాలి.
శ్రీనివాసరావు, హార్టీకల్చర్ నిపుణుడు
