కాంగ్రెస్ ఎదుగుదలను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడు : మాణిక్ రావ్ ఠాక్రే

కాంగ్రెస్ ఎదుగుదలను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడు : మాణిక్ రావ్ ఠాక్రే

కాంగ్రెస్ ఎదుగుదలను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడు

రేవంత్ మాటల్ని బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నది : మాణిక్ రావ్ ఠాక్రే

ఢిల్లీ, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలను సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని కాంగ్రెస్ స్టేట్​ ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే విమర్శించారు. పార్టీ బలోపేతాన్ని చూసి కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతున్నదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం కేసీఆర్​కు నచ్చడం లేదని ఫైర్​అయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ పేరు తీసేందుకు ఇష్టపడని కేసీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు.. ఇప్పుడు ఆందోళనల పేరిట పదే పదే కాంగ్రెస్​ను జపిస్తున్నారని విమర్శించారు. ‘24 గంటల ఉచిత కరెంట్’పై రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల బుధవారం ఠాక్రే స్పందించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్​లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వంశీ చంద్​ రెడ్డి, తెలంగాణ సహ ఇన్​చార్జ్ రోహిత్ చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాటల్ని బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని, పూర్తిగా వింటే ఆయన చెప్పిన ఆలోచనా విధానం అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వరంగల్ డిక్లరేషన్​ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ ను ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. కాంగ్రెస్​లో సీఎం అభ్యర్థులకు కొదవలేదని ఠాక్రే అన్నారు. రేవంత్, ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క ఇలా ఎంతో మంది ఉన్నారన్నారు. అయితే, ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించరని చెప్పారు. మ్యాజిక్​ ఫిగర్ సాధించిన తర్వాత.. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకొని అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు.

రైతులపై తూటాలు పేల్చిన సర్కారులో కేసీఆర్ ఉన్నడు : వంశీ చంద్​ రెడ్డి

2000 ఏడాదిలో బషీర్​బాగ్​లో రైతులపై తూటాలు పేల్చిన టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ కూడా భాగస్వామిగా ఉన్నారని ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్​ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని, త్వరలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్​లో చేరుతారని చెప్పారు. ఇది తెలిసి బీఆర్ఎస్ భయపడుతోందని, సొంత ఇంటిని కాపాడుకోలేని కేసీఆర్ కాంగ్రెస్​పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.