న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్బోణీ కొట్టాయి. ఇష్యూ ధర రూ. 1,080తో పోలిస్తే 32 శాతానికి పైగా ప్రీమియంతో ముగిశాయి. బీఎస్‌ఈలో ఈ షేరు 20.37 శాతం వృద్ధితో రూ.1,300 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 32.40 శాతం పెరిగి రూ.1,430కి చేరుకుంది. చివరికి 31.85 శాతం లాభంతో రూ.1,424.05 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో, కంపెనీ షేర్లు రూ.1,300 వద్ద ప్రారంభమయ్యాయి. 32.40 శాతం జంప్‌తో ఒక్కో షేరు రూ.1,430 వద్ద ముగిసింది.
కంపెనీ మార్కెట్ విలువ రూ.57,045.80 కోట్లుగా ఉంది. వాల్యూమ్ పరంగా చూస్తే, బీఎస్‌ఈలో 12 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 3.31 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. క్యూఐబీల నుంచి వచ్చిన స్పందన కారణంగా ఇది 20 శాతం ప్రీమియంతో లిస్ట్ అయిందని ఒక ఎనలిస్టు అన్నారు. రూ.4,326 కోట్ల మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీఓ గత నెలలో 15.32 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. ప్రమోటర్లు, ఇతర ప్రస్తుత వాటాదారులు ఓఎఫ్ఎస్ ద్వారా 4,00,58,844 ఈక్విటీ షేర్లను అమ్మారు.
ఫ్లాట్‌గా ఇండెక్స్
గ్లోబల్ ఈక్విటీలలో బలహీనమైన పోకడలు, ప్రాఫిట్బుకింగ్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. రోజులో ఎక్కువ భాగం లాభాల్లో ట్రేడవుతున్నప్పటికీ, బీఎస్ఈ సెన్సెక్స్ ఊపందుకోలేదు. చివరికి 2.92 పాయింట్ల నష్టంతో 61,761.33 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది గరిష్టంగా 62,027.51 స్థాయిని, కనిష్టంగా 61,654.94 స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1.55 పాయింట్లు పెరిగి18,265.95 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ కంపెనీల్లో ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, మారుతీ షేర్లు లాభపడ్డాయి.