- మావోయిస్ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ లేఖ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ చీఫ్, దివంగత నేత నంబాల కేశవ్‌రావు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఎక్కడా చెప్పలేదని మావోయిస్ట్ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ముందస్తు ఒప్పందం చేసుకుని లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ (సోను), తక్కళ్లపల్లి వాసుదేవరావు (సతీశ్)లను 'రాజకీయ ద్రోహులు'గా పేర్కొన్నారు. వారికి మావోయిస్ట్పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు లేదని మండిపడ్డారు. ఈ నెల5న అభయ్పేరిట రిలీజైన మూడు పేజీల లేఖ సోమవారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
లేఖ ప్రకారం.." సోను (పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు), సతీశ్(దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) అవకాశవాదంతో మరికొందరు కేడర్‌లను మోసం చేసి తీసుకెళ్లారు. పోలీసులకు లొంగిపోయారు. దాదాపు 3 నెలల క్రితమే సోను లొంగిపోయేందుకు తమను సంప్రదించారని మహారాష్ట్ర సీఎం మీడియాకు చెప్పారు. సతీశ్ పాత్రికేయుల ద్వారా చత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపాడు. అందుకే వారు పనిచేసిన ప్రాంతాల్లో ఆపరేషన్ లను నిలిపి వేస్తున్నట్టుగా గడ్చీరౌళి పోలీసులు ప్రకటించారు.
ఇంద్రావతి నదీ తీరంలో అక్టోబర్ 13 నుంచి 16 వరకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించి వీరి లొంగుబాటును సుగమం చేశాయి" అని అభయ్ తన లెటర్ లో వివరించారు. ఆయుధాలు విడిచిపెట్టడం గురించి పార్టీ ఆలోచించకూడదని.. అది కేంద్ర కమిటీ మాత్రమే చేపట్టాలని కేశవరావు తేల్చి చెప్పినట్లు అభయ్తెలిపారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఎత్తుగడలు వేయాలని సూచించినట్లు చెప్పారు. అంతేగానీ, ఆయుధాలు వద్దనేది కేశవరావు అభిప్రాయం కాదని అభయ్ పేర్కొన్నారు.
